అంత‌లోనే ఏమైంది.. మ‌ళ్లీ ఫ్యామిలీతో క‌లిసి చెన్నై ట్రిప్!

Update: 2019-05-12 05:15 GMT
మూడు రోజ‌ల ముందుగా త‌న ట్రిప్ ను కుదించుకొని హైద‌రాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. మ‌ళ్లీ చెన్నైకి జ‌ర్నీ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ కోసం ఆయ‌న చెన్నై ప్ర‌యాణ‌మైన‌ట్లుగా చెబుతున్నారు. ఓప‌క్క ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ చ‌ర్చ‌ల కోసం స్టాలిన్ తో మాట్లాడేందుకు కేసీఆర్ వెళ్లిన‌ట్లుగా  చెబుతున్న‌ప్ప‌టికీ.. అదే నిజ‌మైతే.. మ‌ళ్లీ ఫ్యామిలీ మొత్తం ప్ర‌యాణం కావ‌టం ఏమిటి? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. అదే స‌మ‌యంలో కేసీఆర్ షెడ్యూల్ చూస్తే.. అందులో మ‌ళ్లీ గుళ్లను ద‌ర్శించుకునే కార్య‌క్ర‌మం ఉండ‌టం ఏమిటి? అన్న‌ది మ‌రో సందేహం.

కేర‌ళ‌.. అటు నుంచి అటు త‌మిళ‌నాడుకు వ‌చ్చిన కేసీఆర్ ఫ్యామిలీ.. వ‌రుస పెట్టి గుళ్ల‌ను సంద‌ర్శించుకున్న వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. త‌మిళ‌నాడు విప‌క్ష నేత‌.. డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ కోసం అంత పెద్ద సీఎం కేసీఆర్ టైం అడ‌గ‌టం.. ఆయ‌న బిజీగా ఉన్నాన‌ని చెప్ప‌టం తెలిసిందే. దీనిపై అప్ప‌ట్లో చాలానే విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. స్టాలిన్ కు టైం లేని నేప‌థ్యంలో.. ఆయ‌న‌తో మీటింగ్ సాధ్యం కాద‌న్న ఉద్దేశంతో హైద‌రాబాద్ కు షెడ్యూల్ కంటే మూడు రోజుల ముందే వ‌చ్చేశారు కేసీఆర్.

శుక్ర‌వారం రాత్రి వ‌చ్చిన ఆయ‌న‌.. స‌మీక్ష‌ల‌తో బిజీగా ఉన్న వేళ‌.. ఈ రోజు (ఆదివారం) ఉద‌యం చెన్నై వెళ్లేందుకు టూర్ ప్లాన్ ఫిక్స్ అయ్యింది. సోమ‌వారం స్టాలిన్ తో మీటింగ్ కు టైం ఓకే అయిన నేప‌థ్యంలో.. ఒక రోజు ముందే ఆయ‌న త‌మిళ‌నాడుకు ప‌య‌న‌మ‌వుతున్నారు. ప్ర‌త్యేక విమానంలో కుటుంబ స‌మేతంగా చెన్నైకి వెళ్లే కేసీఆర్‌.. శ్రీ‌రంగం.. తిరుచ్చి ఆల‌యాల్ని ద‌ర్శించుకోనున్నారు.

రాత్రి చెన్నైలో బ‌స చేసి.. సోమ‌వారం స్టాలిన్ తో భేటీ కానున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల అనంత‌రం త‌లెత్తే ప‌రిణామాలు.. ప్రాంతీయ పార్టీల స‌న్న‌ద్ద‌త‌.. ఇత‌ర అంశాల‌పై ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. తాజా టూర్ లో కేసీఆర్ వెంట కేటీఆర్ ఉండ‌క‌పోవ‌టం. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నిక‌లు తుది ద‌శ‌లో ఉన్నందున కేటీఆర్ తెలంగాణ‌లోనే ఉండి.. వాటిని ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. మొద‌ట లేద‌నుకొని.. త‌ర్వాత మ‌ళ్లీ ఓకే కావ‌టం వెనుక ఏం జ‌రిగింద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News