కేసీఆర్ మార్క్ నిర్ణయం; టీలో అధికారిక క్రిస్మస్

Update: 2015-11-13 12:22 GMT
పండుగల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం రంజాన్ సందర్భంగా అధికారికంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసే తీరులో.. తాజాగా క్రిస్మస్ వేడుకల్ని నిర్వహిస్తూ సరికొత్త సంస్కృతికి తెర తీశారు.

బతుకమ్మ పండగ సందర్భంగా రూ.10కోట్ల నిధులు విడుదల చేసి.. తెలంగాణ వ్యాప్తంగా ధూంధాంగా నిర్వహించిన తెలంగాణ సర్కారు.. ఈసారి క్రిస్మస్ వేడుకల్ని అధికారికంగా నిర్వహంచాలని నిర్ణయించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా.. పండుగ రోజున రెండు లక్షల మంది క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

అంతేకాదు.. ఇప్పటివరకూ ఇఫ్తార్ విందులు మాత్రమే జరిపే ప్రభుత్వం.. తాజాగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 20న ప్రత్యేక విందు ఇవ్వాలని నిర్ణయించారు.

హైదరాబాద్ లోని వంద చర్చిలతో పాటు.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లోని 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. బతుకమ్మ పండక్కి రూ.10కోట్లు విడుదల చేసిన కేసీఆర్.. క్రిస్మస్ వేడుకల కోసం మరెన్ని నిధుల్ని విడుదల చేస్తారో చూడాలి. కేసీఆర్ పుణ్యమా అని.. క్రిస్మస్ సందర్భంగా అధికారిక విందులు షురూ కానున్నాయన్న మాట. మరి.. కేసీఆర్ బాటలో మరెందరు ముఖ్యమంత్రులు నడుస్తారో చూడాలి.
Tags:    

Similar News