కేసీఆర్ టూర్ ముగిసింది... సంజ‌య్ టూర్ ముద‌లైంది

Update: 2020-12-13 13:50 GMT
తెలంగాణ రాజ‌కీయాల‌కు సంబంధించి ఏదో కీల‌క ప‌రిణామం చోటుచేసుకునేలానే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. మూడు రోజుల పాటు డిల్లీలో ప‌ర్య‌టించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌... త‌న పర్య‌ట‌న‌ను ముగించుకుని హైద‌రాబాద్ కు తిరిగి రాగానే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ కి ఆ పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వ‌చ్చింది. దీంతో బండి సంజ‌య్ హుటాహుటీన హ‌స్తిన బ‌య‌లుదేరారు. ఈ ప‌రిణామాలు చూస్తుంటే... టీఆర్ఎస్, బీజేపీల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేపుతున్నాయి.

దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంట‌నే హ‌స్తిన టూర్ కు వెళ్లిన కేసీఆర్‌.. అక్క‌డ బీజేపీ ముఖ్యుల‌తో వ‌రుస భేటీలు వేశారు. ప్ర‌ధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ‌కు రావాల్సిన పెండింగ్ నిధులు, ఇత‌ర‌త్రా అభివృద్ధి ప‌నుల‌పైనే కేసీఆర్ చ‌ర్చించిన‌ట్లుగా వార్త‌లు వినిపించినా... కేసీఆర్ ప‌ర్య‌ట‌న ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే బండి సంజ‌య్ కి ఢిల్లీ నుంచి పిలుపు రావ‌డంతో నిజంగానే ఈ రెండు పార్టీల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న వాద‌న‌ల‌కు బ‌లం చేకూరుతోంది.


ఇటు దుబ్బాకతో పాటు అటు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ త‌న‌దైన శైలిలో బీజేపీ నేత‌ల‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అయినా కూడా కేసీఆర్ అడిగినంత‌నే అటు ప్రధాని మోదీతో పాటు అమిత్ షా అపాయింట్ మెంట్లు ల‌భించాయి. అంతేకాకుండా ఈ ఇద్ద‌రు నేత‌ల‌తో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా కేసీఆర్ అడిగినంత‌నే అపాయింట్ మెంట్లు ఇచ్చేశారు. ఇక కేసీఆర్ టూర్ ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే ఢిల్లీకి రావాలంటూ బండి సంజ‌య్ కి బీజేపీ అదిష్ఠానం నుంచి పిలుపు వ‌చ్చింది. దీంతో ఆదివారం సాయంత్ర‌మే బండి సంజ‌య్ హైద‌రాబాద్ లో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. ఢిల్లీలో ఆయ‌న ప‌లువురు కీల‌క నేత‌ల‌తో భేటీ కానున్నారు. కేసీఆర్ ఇటు రాగానే... బండి సంజ‌య్ ఢిల్లీకి బ‌య‌లుదేరడం, అక్క‌డ ఆయ‌న బీజేపీకి చెందిన కీల‌క నేత‌ల‌తో భేటీ అవుతున్న విష‌యం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.




Tags:    

Similar News