సీమాంధ్రుల ఓట్లకోసం కేసీఆర్ పాట్లే ఇవి

Update: 2015-10-29 04:18 GMT
చరిత్ర ఎన్ని తమాషాలను సృష్టించి వదులుతూ ఉంటుందంటే అది టీఆరెస్ పాలిటి హైదరాబాద్‌ లా కూడా ఉంటుంది. హైదరాబాద్ లేని తెలంగాణ తల లేని మొండెం అని ఏళ్ల తరబడి వాదించి, కొట్లాడి, కేంద్రాన్ని ఒప్పించి మరీ హైదరాబాద్ సహా తెలంగాణను సాధించిన తెరాసకు, దాని అదినేత కేసీఆర్‌ కి హైదరాబాద్ ఇప్పటికీ కొరకరాని కొయ్యగానే ఉంటోంది. ఎంతగానంటే ప్రభుత్వ యంత్రాంగాన్నంతటినీ దింపినా కూడా త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 కార్పొరేటర్ సీట్లలో కనీసం 20 కూడా టీఆరెస్ ఖాతాలో రావని అంచనాలు చెబుతున్నాయి. ఉద్యమానికి గుండెకాయగా నిలిచిన హైదరాబాద్‌ లో ఉద్యమ పార్టీ ప్రభుత్వానికి ఉన్న పరపతి ఇదే మరి.

కారణం సీమాంధ్రుల పట్టు అత్యధికంగా ఉన్న జీహెచ్ ఎంసీలో తెరాసకు ఏ దశలోనూ పట్టు లేకపోవడమే. అధికారంలోకి వచ్చి 16 నెలలయిన తర్వాత కూడా తెరాస ఇక్కడ నామమాత్రంగానే మిగిలిపోయింది. అందుకే కొత్తగా ఇతర పార్టీలనుంచి గ్రేటర్ పరిధిలోని నాయకులకు ఎరవేసి తమలో కలుపుకోవడానికి తెరాస అనేక పాట్లు పడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే..

అందుకే ఎలాగైనా ఈసారి తెరాస పరువు నిలపాలని  హైదరాబాద్‌ కు చెందిన నలుగురు టీఆరెస్ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ - టి. పద్మారావు గౌడ్ - నాయని నరసింహారెడ్డి - మహమ్మద్ ఆలీ కంకణం కట్టుకున్నారు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలుపుకోసం వీరు చేయని ప్రయత్నం అంటూ లేదు. అక్రమ కట్టడాలు - అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం సహాయంతో హైదరాబాద్‌ లో పట్టుసాధించాలని ఈ మంత్రులు పడరాని పాట్లు పడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2007లో బీపీఎస్ - ఎల్ ఆర్ ఎస్‌ పథకాలను ప్రవేశపెట్టిన తర్వాత కూడా నేడు జీహెచ్ ఎంసీ పరిధిలో  80 వేల అక్రమ భవన నిర్మాణాలు. వేలాది అక్రమ లేఅవుట్లు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం.

ఇవన్నీ సీమాంధ్రుల ఆధిపత్యంలోని కాలనీ అసోసియేషన్‌ ల కింద ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా వారిని ప్రసన్నులను చేసుకోవడం కోసం అక్రమ కట్టడాలు, అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాలను ప్రకటించారు. టీఆరెస్‌ కు ఓటేస్తే క్రమబద్దీకరణ విషయంలో సీమాంద్రుల పట్ల ఉదారవైఖరిని ప్రదర్సిస్తామని, ఓటువేయకపోతే మాత్రం తదుపరి పరిణామాలను చవి చూడవలసి వస్తుందని ప్రభుత్వ వర్గాలు లోపాయికారీ హెచ్చరికలు చేస్తున్నాయి. దీనికోసమే తెలంగాణ మంత్రులు పదే పదే బీపీఎస్ - ఎల్ ఆర్ ఎస్ పధకాల అమలుకు గడువును పొడిగించుకుంటూ వస్తూ హైదరాబాద్‌లోని సీమాంధ్రులను ప్రసన్నం  చేసుకోవడానికి పాట్లు పడుతున్నారుట.

ఓట్ల కోసం, కాసిన్ని అదనపు సీట్లు గెల్చుకోవడం కోసం ఆత్మగౌరవమంటూ ఊదరగొట్టుకునే ప్రభుత్వం ఇంత దిగజారిపోవాలా? సీమాంధ్రుల ఓట్లు అని అనుమానం ఉన్న లక్షల ఓట్లను తొలగించడం ద్వారా కాస్త ఎడ్వాంటేజీ వచ్చిందని తెరాస అనుకుంది. అయితే అది విజయానికిచాలదని భయం పుట్టినందువల్లనే ఇప్పుడు ఈ క్రమబద్దీకరణ వ్యవహారం నడుస్తున్నదని పలువురు అంటున్నారు.
Tags:    

Similar News