ఉద్యోగాల‌లో కేసీఆర్ ట్విస్ట్‌... యూపీఎస్సీకి లేని రూల్‌ తెలంగాణ‌లోనే!

Update: 2022-03-12 13:30 GMT
తెలంగాణ‌లో ఇప్పుడు హాట్ టాపిక్ రాష్ట్ర ప్ర‌భుత్వం జంబో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న‌. నిరుద్యోగుల క‌ల‌లు సాకారం చేసేందుకే అని అధికార టీఆర్ఎస్ పార్టీ నేత‌లు చెప్పుకొంటుండ‌గా...ఇదంతా ఎన్నిక‌ల స్టంట్ అంటూ విప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి.

మ‌రోవైపు ఏదైతేనేం త‌మ రాత బాగుప‌డ‌నుంద‌నే భావ‌న‌లో నిరుద్యోగులు ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌లో దేశంలోనే అత్యంత విశ్వ‌స‌నీయ క‌లిగి ఉన్న యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్‌సీ) లో లేని రూల్స్‌ కొన్ని కేసీఆర్‌ స‌ర్కారు విధించింద‌నే టాక్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే...నిరుద్యోగుల క‌ల‌లు నెర‌వేర్చేలా తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు 80000 ఉద్యోగాల భ‌ర్తీకి ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ కొలువుపై బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేవలం ఎన్నికల స్టంట్ రూపంలో మాత్ర‌మే ఉద్యోగాల ప్ర‌క‌ట‌న చేశార‌ని... నిరుద్యోగులు మరోసారి మోసపోవద్దని అన్నారు.

ఉద్యోగ భర్తీ ప్రక్రియకు డెడ్లైన్ లేకుండా... కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లు మాత్ర‌మే చేయ‌డం ద్వారా మరోసారి మోసం చేయడానికి పాలకులు సిద్ధమయ్యారని ప్ర‌వీణ్ కుమార్ ఆరోపించారు. ఎప్పటివరకు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పే దమ్ము ఉందా అంటూ కేసీఆర్ సర్కారును ప్రశ్నించారు.

ఈ సంద‌ర్భంగా విద్యార్థుల కోణంలో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న సంధించారు. 'రాష్ట్రంలో 11 ఏళ్ల‌ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ వేయలేదు. కాబట్టి పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితిని కనీసం 3 నుంచి 5 సంవత్సరాలకు పెంచాలి. అదే విధంగా డీఎస్పీ జాబ్స్కు కనీస ఎత్తు 167.7 సె.మీ.ల నుంచి 165 సెంటీమీటర్లకు తగ్గించాలి.

యూపీఎస్సీలో ఐపీఎస్లకూ 165 సెంటీమీటర్లే కదా? 21వ శతాబ్దంలో, టెక్నాలజీ యుగంలో కూడా ప్రాచీన కొలమానాలు ఎందుకు' అని ప్రవీణ్ కుమార్ క్వశ్చన్ చేశారు. దీంతో ఉద్యోగార్థుల సంక్షేమం కోణంలో గులాబీ ద‌ళ‌ప‌తి మ‌రోమారు టార్గెట్ అయ్యార‌ని అంటున్నారు.
Tags:    

Similar News