కేసీఆర్ బెజ‌వాడ టూర్‌లో ఇన్ని లాజిక్‌లా!!

Update: 2015-12-12 05:47 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని శంకుస్థాప‌న అమ‌రావ‌తి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 22న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్య‌క్షుడు కే చంద్రశేఖర్‌రావు ఇపుడు ఆంధ్రుల తాత్కాలిక రాజ‌ధాని విజ‌య‌వాడ‌కు వ‌స్తున్నారు. దాదాపు రెండునెల‌ల త‌ర్వాత కేసీఆర్‌ న‌వ్యాంధ్ర‌కు రానున్న‌ది దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రుల స‌మావేశానికి హాజ‌ర‌వ‌డంతో పాటు కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా ఆహ్వానించడం కోసం కూడా. అయితే కేవ‌లం ఇంతే కాదండోయ్ కేసీఆర్ స‌న్నిహిత‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మ‌రో రెండు అంశాలు కూడా ఆయ‌న టూర్‌లో ఇమిడి ఉన్నాయి.

ఈరోజు విజయవాడలో జ‌ర‌గ‌నున్నదక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రుల స‌మావేశానికి హాజ‌రుకావ‌డంపై మొద‌ట కేసీఆర్ కొంత ఆలోచించారు. అయితే ఈ సీఎంల‌ క‌మిటీకి వైస్ చైర్మ‌న్ హోదాలో ఉన్నందున వెళ్లాల‌ని డిసైడ‌య్యారు. ఇదే క్ర‌మంలో...ఆయ‌న స్వామికార్యంతో పాటు స్వ‌కార్యం కూడా చేప‌ట్టారు. కేసీఆర్ షెడ్యూల్ ప్ర‌కారం మొద‌ట స‌మావేశానికి హాజరుఅవుతారు. అనంత‌రం త‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న‌ చండీయాగం ఆహ్వానాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబుకు విజ‌య‌వాడ‌లోనే చంద్ర‌బాబుకు అంద‌జేస్తారు. అనంత‌రం మ‌రో రెండు వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల‌ను కూడా కేసీఆర్ త‌న షెడ్యూల్‌లో పొందుప‌ర్చారు.

ఆయుత చండీయాగం నియ‌మ‌నిష్ట‌ల‌తో చేయాల్సి ఉండ‌టం, తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో దుర్గామ‌త‌ను కేసీఆర్ సంద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. అనంత‌రం తెలంగాణ రాష్ర్టం సిద్ధిస్తే చెల్లించుకుంటాన‌న్న మొక్కుల‌ను తీర్చుతారు. ఇలా ఒక్క షెడ్యూల్‌లోనే అటు తెలంగాణ రాష్ర్ట పాల‌కుడిగా అధికారిక కార్య‌క్ర‌మాలు పూర్తిచేయ‌డంతో పాటు త‌న స్వంత కార్య‌క్ర‌మాలు కూడా అయ్యేలా కేసీఆర్ టూర్ ఫిక్స్ చేసుకున్నారు.
Tags:    

Similar News