కేసీఆర్‌.. ఆ ప‌ద‌వులు ఇచ్చేదెప్పుడు?

Update: 2022-02-26 08:30 GMT
కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై యుద్ధం ప్ర‌క‌టించిన తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడుతో సాగుతున్నారు. దేశ‌వ్యాప్తంగా బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏకం చేసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. దాని కోసం వ్యూహాలు సిద్ధం చేస్తూ గ‌డుపుతున్నారు. కానీ మ‌రోవైపు ఆయ‌న ఓ విష‌యం చాలా స్లోగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేవ‌లం బీజేపీపైనే దృష్టి పెట్టిన ఆయ‌న మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళన గురించి మ‌ర్చిపోయార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వాళ్ల ఎదురు చూపులు..

మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని కేసీఆర్ ఎప్ప‌టినుంచో చెబుతున్నారు. అదిగో మంచి రోజు ఇదిగో మంచి రోజు అంటూ దాన్ని ఆల‌స్యం చేస్తూ వ‌స్తున్నారు. దీంతో మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కులు అధినేత క‌టాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీకి వ‌చ్చే ఏడాదే ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా తొంద‌ర‌ప‌డి మంత్రివ‌ర్గంపై దృష్టి సారించాల‌ని నాయ‌కులు కోరుతున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ఓ స్థానం ఖాళీ అయింది. కానీ దాన్ని వెంట‌నే భ‌ర్తీ చేయ‌కుండా ఆ బాధ్య‌త‌ల‌ను ఆర్థిక మంత్రి హ‌రీష్ రావుకు అప్ప‌జెప్పారు.

జాతీయ రాజ‌కీయాలంటూ..

తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మ‌రోవైపు జాతీయ రాజ‌కీయాలంటూ కేసీఆర్ బిజీగా ఉన్నారు. దీంతో ఆయ‌న మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేస్తారో లేదో తెలియ‌డం లేదు. రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొద‌ట తాను, హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ ఇలా ఇద్ద‌రితోనే మంత్రివ‌ర్గం ఏర్పాటు చేశారు. రెండు నెల‌ల త‌ర్వాత మ‌రో ప‌దిమందిని మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. ఆరు నెల‌ల త‌ర్వాత మ‌రో ఆరు ప‌ద‌వులు భ‌ర్తీ చేశారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటా స్థానాల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన బండా ప్ర‌కాష్‌, వెంక‌ట్రామిరెడ్డి మంత్రి ప‌ద‌విపై ఆశ‌తో ఉన్నార‌ని తెలిసింది. ప‌ద‌వీకాలం ఉన్న‌ప్ప‌టికీ రాజ్య‌స‌భ నుంచి బండా ప్ర‌కాష్‌ను కేసీఆర్ తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశారు. మ‌రోవైపు క‌లెక్ట‌ర్ ప‌ద‌వికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి వెంక‌ట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు.

ప్ర‌కాష్‌రాజ్‌కు ఆ ప‌ద‌వి..

 మ‌రోవైపు ఈ ఏడాది జూన్‌తో ముగ్గ‌రు రాజ్య‌స‌భ సభ్యుల స్థానం ఖాళీ అవుతుంది. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజీనామాతో ఒక‌టి.. మ‌రోవైపు డీఎస్‌, లక్ష్మీకాంతా రావు ప‌ద‌వీకాలం జూన్‌లో ముగుస్తుండ‌డంతో అవి రెండు.. ఇలా మొత్తం మూడు టీఆర్ఎస్ ఖాతాలోనే చేర‌తాయి. కానీ వాటికి అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంపై కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఓ స్థానంలో న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. జాతీయ రాజ‌కీయాల్లో త‌న త‌ర‌పున ప్ర‌కాష్‌ను ఉప‌యోగించుకోవాల‌ని కేసీఆర్ చూస్తున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌ను కేసీఆర్ క‌లిసిన స‌మ‌యంలో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి కేసీఆర్ ఎలాంటి లెక్క‌లు వేసుకుంటున్నారో తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే.



Tags:    

Similar News