గెలిస్తే ఉచిత విద్యుత్.. ఉద్యోగాలు పాత హామీలు.. ఇప్పుడు తీర్థయాత్రల ట్రెండ్

Update: 2021-11-02 06:30 GMT
ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే.. ఉచితంగా మంచినీళ్లు ఇస్తాం. ఉచితంగా విద్యుత్ ఇస్తాం. అందరికి ఉద్యోగాలు ఇస్తాం. పెద్ద వయస్కులకు.. వితంతువులకు.. నిరుద్యోగులకు.. ఇలా వారికి వీరికి ఫింఛన్లు.. భ్రతి ఇస్తాం లాంటి హామీల్ని చూశాం. మారిన కాలానికి తగ్గట్లుగా హామీల పర్వం కూడా మారాలి కదా? అందుకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారు ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. త్వరలో ఎన్నికలు జరిగే పంజాబ్.. గోవా లాంటి చిన్న రాష్ట్రాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు.

గతంలో తాము ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మౌలిక వసతులు.. కళాశాలలు.. పరిశ్రమలు ఇలాంటి వాటిని తీసుకొస్తామనే మాటను చెప్పేవారు. అది కాస్తా కాల క్రమంలో ఆల్ ఫ్రీ గా మారిపోయింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడి.. రాష్ట్ర ప్రజలకు తీర్థయాత్రల్ని ఉచితంగా చేయిస్తామని కేజ్రీవాల్ హమీ ఇచ్చారు. గోవాలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. తాము రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తీర్థయాత్రల్ని ఉచితంగా చేయిస్తామని చెప్పారు.

మాట వరసకు కాకుండా చాలా క్లారిటీతో ఈ హామీని వెల్లడించటం గమనార్హం. గోవాలోని హిందువులకు అయోధ్యకు..
క్త్రైస్తవులకు వేలంకన్ని.. ముస్లింలకు అజ్మీర్ షరీఫ్ కు సాయిబాబాను కొలిచే వారికి షిర్డీకి ఉచితంగా తీసుకెళతామని ప్రకటించారు. గోవాలో ఇప్పటికే కాంగ్రెస్.. బీజేపీలు ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. ఆమ్ ఆద్మీతో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం తన టీఎంసీ తరఫున అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో కేజ్రీవాల్ పార్టీ అంతకంతకూ బలోపేతం అవుతున్న వేళలో.. ఆయన నోటి నుంచి వచ్చిన తాజా హామీలు చర్చనీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో మరెన్ని హామీలు ఇస్తారో?


Tags:    

Similar News