రూ.800 కోట్ల అప్పుల్లో విద్యా సంస్థల అధినేత

Update: 2015-09-10 06:35 GMT
ప్రముఖ విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు విద్యా సంస్థల అధిపతి అయిన కేశవరెడ్డి మీద వెల్లువెత్తిన ఫిర్యాదుల మేరకు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి రూ.800కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన కేశవరెడ్డి పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.

రెండు.. మూడు తరగతుల్లో పిల్లల్ని చేర్చిన వారు రూ.లక్ష (ఇది నాలుగైదేళ్ల క్రితం.. ఆ తర్వాత దీన్నే రూ.2లక్షలు చేశారు) డిపాజిట్ చెల్లిస్తే.. పుస్తకాల ఖర్చుల మినహా మిగిలిన దేనికి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని.. పదో తరగతి వరకూ ఉచితంగా చదువు చెబుతామని.. పదో తరగతి అయిన తర్వాత మొదట కట్టిన రూ.లక్ష డిపాజిట్ ను తిరిగి ఇస్తామని ప్రకటించటంతో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కేశవరెడ్డికి భారీగా డిపాజిట్లు చేశారు. ఏడాదికి పాతిక వేల వరకూ ఉన్న ఫీజులు కట్టే కన్నా..  ఒకేసారి లక్ష రూపాయిలు చెల్లించి.. పిల్లల చదువులయ్యాక తిరిగి మొదట డిపాజిట్ చేసిన మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చన్న ఆలోచనలో ఈ మొత్తాన్ని కట్టేసేవారు.

అలా పిల్లల తల్లిదండ్రుల వద్ద నుంచి సేకరించిన మొత్తం దాదాపు రూ.800కోట్లుగా తేలినట్లు చెబుతున్నారు. దీంతో పాటు.. పలు బ్యాంకుల్లో ఆయన పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారని.. వాటి వడ్డీలు కట్టని నేపథ్యంలో ఇప్పటికే ఆయన ఆస్తులకు సంబంధించి కొన్ని బ్యాంకులు వేలం నోటీసులు ఇచ్చాయి. దీంతో.. తాము చెల్లించిన డిపాజిట్ ను తిరిగి చెల్లించాలని కోరుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది. గడువు తీరిన తర్వాత కూడా డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోవటంతో ఇప్పటికే పలువురు కేశవరెడ్డి మీద కేసులు పెట్టారు.

తాజాగా ఆయన్ను కర్నూలు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కాసేపట్లో ఆయన్ను కోర్టుకు హాజరు పరిచి.. రిమాండ్ కోసం కోరనున్నట్లు చెబుతున్నారు. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఒక ప్రశ్నగా మారితే.. కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత అరెస్ట్ తో.. ఆయా స్కూళ్లలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు భవితవ్యం ఏమిటన్నది ఇప్పుడో సందేహంగా మారింది.
Tags:    

Similar News