చిరుది పోస్ట్ పెయిడ్..ప‌వ‌న్ ది ప్రీపెయిడ్:కేశినేని

Update: 2018-03-21 14:09 GMT
గుంటూరులో జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో టీడీపీపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన సంగతి తెలిసిందే. ఆ స‌భ త‌ర్వాత ప‌వ‌న్ కల్యాణ్ పై ఏపీ సీఎం చంద్ర‌బాబు నుంచి టీడీపీ ఎమ్మెల్యేల వ‌ర‌కు విమ‌ర్శ‌లు గుప్పించేస్తున్న విష‌యం విదిత‌మే. కేవ‌లం ప‌వ‌న్ నే కాకుండా ఆయ‌న సోద‌రుడు చిరంజీవిపై కూడా కొంద‌రు టీడీపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. తాజాగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా ఆ జాబితాలో చేరారు. కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నాని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ అని, పవన్ జనసేన ప్రీపెయిడ్ పార్టీ అని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోన్న ప‌వ‌న్.....చిరంజీవిని ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని నాని అన్నారు. బుధ‌వారం నాడు పార్ల‌మెంటు బ‌య‌ట నాని మీడియాతో మాట్లాడారు.

నాడు చిరును నిల‌దీయ‌లేని ప‌వ‌న్ నేడు చంద్రబాబును విమ‌ర్శించ‌డం స‌రికాద‌ని నాని అన్నారు. బీజేపీకి పోయే కాలం ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని, అందుకే ఆ ర‌కంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఉండాల‌ని బీజేపీ యోచించ‌డం స‌రికాద‌న్నారు. సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగక‌పోవ‌డం స‌రికాద‌ని, సభను స‌జావుగా న‌డిపించాల్సిన‌ బాధ్యత సభాపతిదేన‌ని నాని అన్నారు. అవిశ్వాసంపై చ‌ర్చ‌కు కేంద్రం సిద్ధంగా లేద‌ని, అందుకే అన్నాడీఎంకే - టీఆర్ ఎస్ ఎంపీలతో కేంద్రం చ‌ర్చించ‌డం లేద‌ని చెప్పారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ....మోదీ నుంచి స్పందన లేదని, తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని దేశం గ‌మ‌నిస్తోంద‌ని ఏపీ ఎంపీలు అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ చేసిన తప్పునే ఈ రోజు బీజేపీ చేస్తోందని అన్నారు. కావాలనే టీఆర్ ఎస్ - అన్నాడీఎంకే ఎంపీలు స‌భ‌లో ఆందోళన చేస్తున్నారని - సభలో అవిశ్వాసంపై చర్చ జరిగితే వారి సమస్యలు కూడా చర్చించవచ్చ‌ని వారు అభిప్రాయ‌పడ్డారు. స‌భ‌ను స‌జావుగా జ‌రిపేందుకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని ఏపీ ఎంపీలు కోరారు.
Tags:    

Similar News