అంత ప‌నిచేసేందుకు సిద్ధ‌మంటున్న కేశినేని

Update: 2017-05-24 15:39 GMT
గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోవ‌డం వ‌ల్లే త‌న‌కు మెజార్టీ త‌గ్గింద‌ని వ్యాఖ్యానించి క‌ల‌క‌లం సృష్టించి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఈ వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగిన‌ప్ప‌టికీ త‌న దూకుడు ఏమాత్రం త‌గ్గించుకోలేదు. మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ విష‌యంలో సంయ‌మ‌నం పాటించాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశించిన‌ప్ప‌టికీ...మ‌రోమారు మీడియాతో మాట్లాడుతూ నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మెజార్టీ గురించి త‌న విశ్లేష‌ణ ప్రకారమే మాట్లాడానని స్ప‌ష్టం చేశారు. కార్యకర్తల్లో మోటివేషన్ కోసమే తప్ప మరో విధంగా మాట్లాడలేదని వివ‌రించారు. పార్టీ సమావేశంలోనే మాట్లాడాను తప్ప బహిరంగ సభలో మాట్లాడలేదుగా అంటూ కేశినేని నాని గొప్ప లాజిక్ తీశారు.

తాను వ్య‌క్తిగ‌తంగా మాట్లాడానా, తెలుగుదేశం పార్టీ ఎంపీగా మాట్లాడాత‌నా, పార్టీ ప్ర‌తినిధి హోదాలో మాట్లాడానా....అనేది దీనిపై చ‌ర్చించే వారి  విచక్షణకే వదిలేస్తున్నాన‌ని కేశినేని విశ్లేషించారు. ఏది ఏమైనా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాన‌ని నాని పున‌రుద్ఘాటించారు. త‌న వ్యాఖ్యలపై చంద్రబాబు వివరణ అడిగితే ఇస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌నకు ఆయనే అదిష్టానమ‌ని తేల్చిచెప్పారు.  తలపగిలినా పర్వాలేదు కొండను డికొట్టేందుకు సిద్దమేన‌ని ప్ర‌క‌టించిన కేశినేని..అదే నా కాన్ఫిడెన్స్ లెవల్ అంటూ వ్యాఖ్యానించారు.  రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తులు, నామినేటెడ్ ప‌ద‌వులు అనేవి అధిష్టానం చూసుకుంటుంద‌ని అన్నారు.

ఇదిలాఉండ‌గా కేశినినేని నాని వ్యాఖ్య‌లుకు ముందే సీఎం, టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు క్ర‌మ‌శిక్ష‌ణ క్లాస్ తీసుకున్నారు.అమరావతిలో ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం చంద్రబాబు  ఇకపై చంద్రబాబు అంటే ఏంటో చూపిస్తానని, పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సత్వరమే కఠిన చర్యలు తీసుకుంటానని సీరియస్‌ అయ్యారు. కొందరు క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ  టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా బీజేపీతో మిత్రబంధం కొనసాగుతుందని, బీజేపీ నేతలు టీడీపీపై విమర్శలు చేస్తే ఆ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. అయితే బాబు ఈ హెచ్చ‌రిక‌లు చేసిన త‌ర్వాత‌నే కేశినేని త‌న కామెంట్లు తాను చేయ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News