మమత ఆధ్వర్యంలో కీలక సమావేశం

Update: 2022-02-15 05:53 GMT
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తొందరలోనే ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. ఆ సమావేశానికి బీజేపీ, కాంగ్రెసేతర సీఎంలు అందరినీ పిలుస్తున్నట్లు మమత ప్రకటించారు. బీజేపీ పాలన నుండి దేవాన్ని రక్షించుకోవాలంటే బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రులంతా ఒకే వేదిక మీదకు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇందులో భాగంగానే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్,

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను ఫోన్లో మాట్లాడినట్లు స్వయంగా మమతే చెప్పారు. యూపీలో బీజేపీ ఓడితేనే ప్రత్యామ్నాయ వేదిక ప్రయత్నాలు ఊపందుకుంటుందన్నారు. యూపీలో అఖిలేష్ గెలుపు ఖాయమని జోస్యం కూడా చెప్పారు.

కొద్దిరోజులుగా నరేంద్ర మోడీ సర్కార్ పై మమత తీవ్రస్థాయిలో మండిపోతున్న విషయం తెలిసిందే. అంతే స్ధాయిలో బెంగాల్లో మమత ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ కూడా ఇబ్బందులు పెడుతోంది. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధడకర్ ను అడ్డు పెట్టుకుని బాగా సతాయిస్తోంది. ఇలాంటి అనేక కారణాలతో మోడీ-మమత మధ్య అగాధం బాగా పెరిగిపోయింది. ఇందుకనే మోడీ అంటేనే మమత అంతెత్తున ఎగిరి పడుతున్నారు.

ఇందులో భాగంగానే తనతో కలిసొచ్చే ముఖ్యమంత్రులను, పార్టీల అధినేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మమత పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మమత మరచిపోయిన విషయం ఒకటుంది. జాతీయ స్ధాయిలో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు కావాలంటే కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదు. ఈ విషయాన్ని కాంగ్రెసేతర పార్టీలు ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లాంటి వాళ్ళు చెబుతున్నది వాస్తవం.

జాతీయ స్ధాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, ప్రత్యామ్నాయ వేదికకు నాయకత్వం వహించాలని అనుకుంటున్న మమతకు కాంగ్రెస్ ను కలుపుకోవటం ఇష్టం లేదు. పైగా మమత ఫోన్లో మాట్లాడిన స్టాలిన్ యూపీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు. యూపీఏని కాదని మమతతో చేతులు కలపటం సాధ్యమేనా ? అన్నది తేలాలి.

 ఏదేమైనా రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలన్న మమత వల్ల అంతిమంగా లాభపడేది బీజేపీనే అనేది వాస్తవం. మరీ విషయాన్ని మమత ఆలోచిస్తున్నదో లేదో అర్థం కావటం లేదు. ఇలాంటి వాళ్ళున్నంత వరకు మోడీ ఫుల్లు హ్యాపీ.
Tags:    

Similar News