కేజీఎఫ్ బంగారు గనుల్లోకి ఆశగా వెళ్లి..

Update: 2020-05-14 10:50 GMT
కేజీఎఫ్.. ఈ కన్నడ సినిమా దేశవ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) గనులు ఉన్నాయి. ఇక్కడ బంగారం ఉత్పత్తి చేస్తుంటారు. ఈ బంగారం గనులు లాక్ డౌన్ కారణంగా మూతపడి ఉన్నాయి. 40 రోజులుగా మూసి ఉండడంతో అక్కడ సదుపాయాలన్నీ ఆపు చేశారు.

అయితే ఇక్కడ బంగారం, ఇతర సామగ్రిని దొంగతనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు దొంగలు అడ్డంగా బుక్కైపోయారు. ఇక్కడ చోరీకి యత్నించేందుకు వెళ్లిన ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించడం కలకలం రేపింది.

కేజీఎఫ్ గనుల్లో ఎవరూ లేకపోవడంతో దోచుకునేందుకు 100 అడుగుల లోతులోకి గనుల్లోకి  ఐదుగురు దొంగలు దిగారు. అయితే నిర్వహణ లేకపోవడంతో అక్కడ ఆక్సిజన్ సరఫరా లేకుండా పోయింది. దీంతో ఊపిరాడక ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.దొంగలు పెద్దగా కేకలు వేయడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఇద్దరినీ రక్షించి ఆసుపత్రికి తరలించారు.

లాక్ డౌన్ అమల్లో ఉండగా.. కొన్ని వారాలుగా కోలార్ బంగారు గనుల్లో బంగారం వెలికితీత నిలిచిపోయింది. కేజీఎఫ్ గనులు మూతపడి ఉన్నాయి. ఇదే అదునుగా చోరీ చేద్దామని వెళ్లగా.. నిర్వహణ లేక ఆక్సిజన్ సరఫరా కాక దొంగల ప్రాణాలు పోయాయని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News