పెళ్లికూతురు పేరు గోప్యమంటున్న మాజీ సీఎం!

Update: 2016-11-03 05:06 GMT
ప్రత్యేక హోదా ఉద్యమం పీక్స్ వచ్చిన తర్వాత - ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉండి "లాస్ట్ బాల్" అనే మాటతో విమర్శలు ఎదుర్కొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి వెలుగులోకి వచ్చారు. రాష్ట్రాల విభజన అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో కొత్త పార్టీతో రంగ ప్రవేశం చేసి ఘోర పరాజయం పాలైన నాటి నుంచి ఎవ్వరికీ కనిపించకుండా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి - అటు రాజకీయంగా కాని - ఇటు వ్యక్తిగతంగా కానీ ఏ కార్యక్రమంలోనూ ఎక్కువగా పాల్గొన్నట్లు లేదు. అయితే చాలా కాలం తర్వాత తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు కిరణ్ చెప్పిన సమాధానమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన ఉమ్మడి ఏపీ చివరి సీఎం... అభిమానులు - కార్యకర్తలను ఆత్మీయంగా పలుకరించారు. "ఏమన్నా అందరూ బాగున్నారా.. ఏం చేస్తున్నారు" అంటూ గ్రామస్థులను పేరుపేరునా పలకరించారు. అందరి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక కార్యకర్త కిరణ్ కుమార్ రెడ్డిపై ఒక ప్రశ్న సందించాడు. "తమను ఏదో ఓక పార్టీలోకి తోయండి - ఆపార్టీని పట్టుకుని అయినా వేలాడుతుంటాము - ఏమీ చెప్పకపోతే ఏలా?" అని అనగా... దీనికి మాజీ సీఎం తనదైన శైలిలో స్పందించారు. ఇన్ డైరెక్టుగా చెప్పాలని అలా అన్నారో.. లేక డైరెక్టుగానే చెప్పేసినట్లు భావించారో కానీ... కార్యకర్తలకు మాత్రం చిన్న క్లూ ఇచ్చారు.

"ఇప్పటికే పెళ్లి గురించి మాట్లాడాము.. అయితే - పెళ్లికూతురు పేరు మాత్రం ప్రస్తుతానికి గోప్యం.. తాళిబొట్టు కట్టే తేది ఖారారైతే మీకందరికి శుభలేఖలు వస్తాయి.. తొందరెందుకు?" అని సమాధానం చెప్పారు. దీంతో కార్యకర్తలు భవిష్యత్ పై ఎవరిస్థాయిలో వారు ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వైకాపాలోకి కిరణ్ అని అనుకుంటుంటె.. మరికొందరు, టిడిపి అని, ఇంకొందరు బిజెపి అని గుసగుసలాడుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు... సీఎం హోదా ఇచ్చిన పాతగూడే బెటర్ అని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి కుమార్తె ఎవరనేది, కిరణ్ కుమార్ రెడ్డి మనసులో ఏముందో అనేది తెలియాలంటే ఇంకాస్త సమయం వెయిట్ చేయక తప్పదు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News