కాంగ్రెస్ తో త‌మ్ముళ్ల అక్ర‌మ సంబంధానికి సాక్ష్య‌మిదే!

Update: 2018-07-30 10:36 GMT
చేతిలో ప‌వ‌ర్ ఉండేందుకు ఎన్ని అడ్డ‌దారులు తొక్క‌టానికైనా సిద్ధ‌మన్న‌ట్లుగా ఉంది టీడీపీ ప‌రిస్థితి. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఎవ‌రో ఒక‌రి నెత్తిన చెయ్యి వేసేందుకు త‌యార‌వుతూ ఉంటుంది. అయితే.. ఈ కుయుక్తిని కొన్నిసార్లు ప్ర‌జ‌లు గుర్తించి తిప్పి కొట్టారు కూడా. కానీ.. బుద్ధి తెచ్చుకోని చంద్ర‌బాబు.. మ‌రోసారి అక్ర‌మ సంబంధానికి సిద్ధం కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మిగిలిన పార్టీల‌తో చంద్ర‌బాబు జ‌త క‌ట్ట‌టం ఒక ఎత్తు.. కాంగ్రెస్ పార్టీతో క‌ల‌వ‌టం మ‌రో ఎత్తు. ఆ మాట‌కు వ‌స్తే.. కాంగ్రెస్ ను విభేదించి.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా స్థాపించిన పార్టీనే తెలుగుదేశం. ఆ పార్టీ పుట్టుకే కాంగ్రెస్ వ్య‌తిరేక‌త‌తో పుట్టింది. అలాంటి పార్టీతో నైనా సంబంధానికి సిద్ధ‌మ‌వుతున్న తీరు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్ని విస్మ‌యానికి గురి చేస్తోంది.

2009లో టీఆర్ ఎస్ తో.. వామ‌ప‌క్షాల‌తో క‌లిసి మ‌హా కూట‌మి పేరుతో తెలుగు ప్ర‌జ‌ల్ని న‌మ్మించేందుకు చేసిన ప్ర‌య‌త్నాల్ని ఏ రీతిలో తిప్పి కొట్టారో తెలిసిందే. విభ‌జన లాంటి ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో మోడీ మీద ఉన్న అభిమానంతో బీజేపీ-జ‌న‌సేన‌ల‌తో జ‌త క‌ట్టిన బాబు కొద్దిపాటి మెజార్టీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టం తెలిసిందే.

మ‌రో ఏడాది కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే సార్వ‌త్రికానికి సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. కాంగ్రెస్ తో జ‌త క‌ట్టేందుకు చంద్ర‌బాబు జోరుగా పావులు క‌ద‌ప‌ట‌మే కాదు.. ర‌హ‌స్యంగా ఒప్పందం కుదుర్చుకున్నార‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. ఈ విష‌యంపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేన‌ప్ప‌టికీ.. ప‌రిస్థితుల్ని చూసుకొని ప్ర‌క‌టిస్తార‌న్న మాట వినిపిస్తోంది.

ఇలాంటి వేళ‌.. టీడీపీతో త‌మ‌కున్న బంధాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ ను ఛీ కొట్టి.. నాలుగున్న‌రేళ్ల‌కు మ‌ళ్లీ అదే పార్టీలో చేరిన కిర‌ణ్ కుమార్ రెడ్డి. నాలుగేళ్లుగా ఇంట్లో కూర్చున్న కిర‌ణ్ కుమార్‌.. ఈ మ‌ధ్య‌న కాస్త యాక్టివ్ అయి.. టీడీపీతో అక్ర‌మ సంబంధానికి మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదే విష‌యాన్ని ఆయ‌న చెబుతూ.. టీడీపీ నేత‌ల‌తో త‌న‌కు సంబంధాలు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని.. త‌మ పార్టీకి లోబ‌డే ప‌ని చేస్తాన‌ని చెప్పారు. టీడీపీతో క‌ల‌వాలో వ‌ద్దో అన్న విష‌యాన్ని పార్టీ నిర్ణ‌యిస్తుంద‌న్న ఆయ‌న‌.. వారి సూచ‌న‌ల్ని తాను అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. త‌న‌ను పార్టీలోకి ఎందుకు పిలిచారో పార్టీ అధినాయ‌క‌త్వానికే తెలుస‌న్న ఆయ‌న‌.. టీడీపీతో పొత్తుపై ఆయ‌న ప‌రోక్ష సంకేతాల్ని ఇచ్చారు. విభ‌జ‌న అన్న‌ది రాష్ట్రానికి సంబంధించిన అంశం కావ‌టంతో కాంగ్రెస్ ను తాను వ్య‌తిరేకించాన‌ని.. పొత్తు అనేది పార్టీకి సంబంధించిన అంశం కావ‌టంతో దాన్ని హైక‌మాండ్ చెబితే అమ‌లు చేస్తాన‌ని త‌న‌దైన శైలిలో స‌మాధాన‌మిస్తున్నారు కిర‌ణ్ కుమార్ రెడ్డి.

ఏ పార్టీ మీద వ్య‌తిరేక‌త‌తో టీడీపీ పుట్టిందో.. ఇప్పుడు అదే పార్టీతో భుజాలు రాసుకునే వ‌ర‌కూ వెళ్ల‌టం చూస్తే.. ఇంత‌కు మించిన అక్ర‌మ సంబంధం మ‌రెక్క‌డా ఉండ‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News