రాహుల్ రూట్ కాదంటున్న కిరణ్ కుమార్ రెడ్డి... ?

Update: 2022-10-19 09:30 GMT
ఆయన ఉమ్మడి ఏపీకి చిట్ట చివరి సీఎం.  వైఎస్సార్ రెక్కల కష్టంతో రెండవమారు నాడు కాంగ్రెస్ గెలిస్తే హాయిగా మూడేళ్లకు పైగా సీఎం గా అధికారం అందుకున్న నేత. ఆయనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పెద్దల దయతోనే ఆ పదవిలోకి వచ్చారన్నది నిజం. కానీ ఆయన దానికి తగిన విధేయత కృతజ్ఞత చూపించారా అంటే చివరి రోజుల్లో కాంగ్రెస్ హై కమాండ్ కి ఎదురు తిరిగి వీర సమైక్యవాదిగా తానూ ఉన్నాను అని  జనాలకు పంపించారు.

ఒక వైపు పార్లమెంట్ లో ఉమ్మడి ఏపీ రెండుగా విభజిస్తున్న వేళ కూడా లాస్ట్ బాల్ అంటూ ఏపీలో ఒక లెవెల్ లో స్టేట్మెంట్స్ ఇచ్చి జనాలలోలేని పోని  ఆశలు రేపిన పెద్ద మనిషి. తీరా విభజన ప్రక్రియ అంతా పూర్తి అయ్యాక ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. అప్పటికే దాపుగా ముఖ్యమంత్రి పదవి కూడా పూర్తి కావచ్చింది.

ఆ మీదట సమైక్యాంధ్రా అంటూ పార్టీ పెట్టి తన తమ్ముడిని పోటీకి దించినా ఆయన గెలవలేదు. అలా కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి  ఆ మధ్యన ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నట్లే లెక్క. అలాంటి ఆయన తన సొంత రాష్ట్రం ఏపీలో రాయలసీమలో కర్నూల్ జిల్లాలో రాహుల్ గాంధీ చెమటోడ్చి  ప్రతిష్టాత్మకమైన భారత్ జోడో యాత్ర సాగిస్తూంటే కిరణ్ కుమార్ రెడ్డి  ఎక్కడా కనిపించకపోవడం మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా ఉంది.

రాహుల్ యాత్ర ఏపీలో రెండవ రోజు సాగుతోంది. మరో మూడు రోజుల పాటు సాగనుంది. అయితే కాంగ్రెస్ పెద్దలు దిగ్విజయ్ సింగ్, కేంద్ర  మాజీ మంత్రులు జేడీ శీలం, ప‌ల్లంరాజు, మాజీ ఎంపీ క‌నుమూరి బాపిరాజు, తెలంగాణ ఎమ్మెల్యే సీత‌క్క రాహుల్ తో పాటు  న‌డుస్తున్నారు. కానీ కాంగ్రెస్ వల్ల అతి పెద్ద ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కనిపించకపోవడం పై పార్టీలో చర్చ సాగుతోంది.

అయితే కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి చేరినా ఆయన యాక్టివ్ గా లేరనే అంటున్నారు. అందుకే ఆయన సైలెంట్ గా ఉంటూ అన్ని పరిణామాలను గమనిస్తున్నారు అని అంటున్నారు. దేశంలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకోదు అని ఆలోచనలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. అందువల్లనే ఆయన రాహుల్ పాదయాత్రలో ఎక్కడా కనిపించడంలేదు అని అంటున్నారు. అదే నిజమైతే రాహుల్ కి ఆయాసం తప్ప ఏపీలో కాంగ్రెస్ కి కొత్త కాంతి కిరణాలు కనిపిస్తాయా అన్న చర్చ అయితే ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News