ఎంపీ బ‌రిలో కిర‌ణ్ కుమార్ రెడ్డి!

Update: 2018-08-23 11:10 GMT
ఉమ్మ‌డి రాష్ట్ర ఆఖ‌రి ముఖ్య‌మంత్రిగా కిర‌ణ్ కుమార్ రెడ్డిని కొన్ని వ‌ర్గాలు అస్స‌లు మ‌ర్చిపోలేవు. అటు తెలంగాణ‌లోనూ.. ఇటు ఆంధ్రాలోనూ ఆయ‌న్ను అభిమానించే వారు.. ముఖ్య‌మంత్రిగా ఆయ‌న‌కు భారీ మార్కులు వేసే వాళ్లు చాలామందే ఉన్నారు. మిగిలిన ముఖ్య‌మంత్రులతో పోలిస్తే.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని ఒక గాటుకు తీసుకురావ‌టంతో పాటు.. అవినీతిని కంట్రోల్ చేయ‌టంతో పాటు.. దుబారా ఖ‌ర్చు విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన అతి కొద్ది ముఖ్య‌మంత్రుల్లో కిర‌ణ్ కుమార్ రెడ్డి ఒక‌రుగా చెబుతారు.

మ‌రే ముఖ్య‌మంత్రి చేయ‌ని సాహ‌సం కిర‌ణ్ చేశార‌ని.. మ‌జ్లిస్ అధినేత అస‌ద్‌.. ఆయ‌న సోద‌రుడు అక్బ‌రుద్దీన్ ల విష‌యంలో కిర‌ణ్ వ్య‌వ‌హ‌రించిన తీరు.. మ‌హ‌వీర్ ఆసుప‌త్రి భూమిని కాపాడే విష‌యంలో ఆయ‌న వైఖ‌రిని ఇప్ప‌టికి గుర్తు చేసుకునే ప‌రిస్థితి. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో సొంతంగా పార్టీ పెట్టి.. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌. ఈ మ‌ధ్య‌నే కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌టం తెలిసిందే.

ఏపీ రాజ‌కీయాల్లో ఆయ‌న దృష్టి సారించ‌నున్న‌ట్లుగా చెప్పారు. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి తన పాత్ర‌పై దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. అంద‌రూ అనుకున్న‌ట్లుగా ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా బ‌రిలోకి దిగాల‌న్న ఆలోచ‌న‌లో కిర‌ణ్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ స‌రికాద‌న్న భావ‌న‌లో ఉన్న కిర‌ణ్.. త‌న‌కున్న వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మాతో ఎంపీగా అయితే గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కిర‌ణ్ ధీమాకు కార‌ణం లేక‌పోలేదు. ఆయ‌న బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్న రాజంపేట ఎంపీ సీటును చూస్తే.. కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు చిత్తూరులోనూ.. మ‌రికొన్ని క‌డ‌ప జిల్లాలో ఉండ‌టం ల‌బిస్తుంద‌ని చెబుతున్నారు. చిత్తూరు త‌న సొంత జిల్లా కావ‌టం.. క‌డ‌ప‌లో త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో గెలుపు ప‌క్కా అన్న భావ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ వినిపిస్తున్న‌ట్లుగా టీడీపీ.. కాంగ్రెస్‌ల మ‌ధ్య పొత్తు ఖ‌రారైతే.. అది కూడా కిర‌ణ్ కు మ‌రింత‌గా లాభిస్తుంద‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఉంటే లేనిపోని ఇబ్బంది అని.. అందుకే కేంద్రంలోకి వెళితే త‌న‌కూ.. ఏపీకి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌న్న భావ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాజంపేట‌కు సంబంధించి టీడీపీకిబ‌ల‌మైన అభ్య‌ర్థి లేక‌పోవ‌టంతో.. ఆ సీటును ప్ర‌త్య‌ర్థుల‌కు అప్ప‌గించే క‌న్నా.. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా కిర‌ణ్ కు కేటాయించ‌టంలో పెద్ద‌గా అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌ర‌ని చెబుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లోనూ  రాజంపేట సీటును బీజేపీ అభ్య‌ర్థి పురంధేశ్వ‌రికి అప్ప‌జెప్ప‌టాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. తాము బ‌రిలోకి దిగినా ఓడే సీటును మిత్ర‌ప‌క్షం అభ్య‌ర్థికి అప్ప‌గిస్తే.. మిత్ర‌ధ‌ర్మం పాటించిన‌ట్లు ఉండ‌టంతో పాటు.. ఓట‌మి లెక్క త‌మ ఖాతాలో ప‌డ‌కుండా ఉంటుంద‌న్న ఆలోచ‌న బాబు చేసే వీలుంది. అందుకే.. రాజంపేట ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కిర‌ణ్ బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  

Tags:    

Similar News