ద‌త్త‌న్న బ‌దులుగా ఆ ఇద్ద‌ర్లో ఒక‌రు

Update: 2017-09-02 05:08 GMT
ఎంతోకాలంగానో వినిపిస్తున్న కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఎట్టకేల‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 3న (ఆదివారం) ఉదయం 10గంటలకు రాష్ట్రపతి భవన్‌ లో కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని అధికారవర్గాలు వెల్లడించారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన టీమ్‌ ను సిద్ధం చేసుకుంటున్నారు. 2014 మేనెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే ప్రభుత్వానికి ఇది రెండో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ. 2019 లోక్‌ సభ ఎన్నికలు - త్వరలో రానున్న నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మంత్రివర్గ కూర్పు ఉంటుందని తెలుస్తున్నది. మార్పులకు అవకాశమిస్తూ.. నలుగురు  సహాయ మంత్రులు ఇప్పటికే రాజీనామా చేయగా - మరికొందరు సీనియర్ మంత్రులూ క్యాబినెట్ నుంచి వైదొలుగనున్నారని తెలుస్తున్నది.

కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి ద‌త్తాత్రేయ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దత్తాత్రేయ సహా పలువురు సీనియర్ మంత్రులను గవర్నర్లుగా పంపనున్నారని సమాచారం. దత్తన్న స్థానంలో తెలంగాణ నుంచి కిషన్‌ రెడ్డి లేదా మురళీధర్‌ రావును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని ఒకే శాఖకు పరిమితంచేస్తూ, కీలకమైన రక్షణశాఖను హిమంత బిశ్వశర్మకు అప్పగించనున్నారని విశ్వసనీయ సమాచారం. వేర్వేరుగా ఉన్న ఉపరితల రవాణా - నౌకాయాన - రైల్వే శాఖల్ని ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. వీటి బాధ్యతను నితిన్ గడ్కరీకే అప్పగించనున్నారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా - ప్రధాని మోడీ గురువారం సమావేశమై క్యాబినెట్ మార్పులకు తుదిరూపు ఇచ్చారు. కొత్త మంత్రులకు స్థానం కల్పించేందుకు వీలుగా నలుగురు సహాయ మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ - సంజీవ్‌ కుమార్ బల్యాన్ - ఫగ్గన్‌ సింగ్ కులస్తే - మహేంద్రనాథ్ పాండే శుక్రవారం తమ మంత్రి పదవులకు రాజీనామాచేశారు. వీరితోపాటు ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఉమాభారతి - కల్‌ రాజ్‌ మిశ్రా కూడా రాజీనామా పత్రాలు సమర్పించారని సమాచారం. వీరితోపాటు వైదొలుగనున్న మంత్రుల్లో వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్ పేరు కూడా వినిపిస్తున్నది. 76 ఏళ్ల‌ కల్‌ రాజ్ మిశ్రాను తప్పించి, ఏదో ఒక రాష్ర్టానికి గవర్నర్‌ గా పంపుతారని సమాచారం. కొత్తగా క్యాబినెట్‌ లో చేరనున్న వారిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్‌ యాదవ్ - ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే - పార్టీ నేతలు ప్రహ్లాద్ పటేల్ - సురేశ్ అంగడి - సత్యపాల్ సింగ్ - అనురాగ్ ఠాకూర్ - శోభా కరంద్లాజే - మహీశ్ గిర్రి - ప్రహ్లాద్ జోషి ఉండవచ్చని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈశాన్య రాష్ర్టాల్లో పార్టీ బలోపేతంతోపాటు కశ్మీర్‌ లో పీడీపీతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ కు - అసోం - మణిపూర్‌ లలో పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన హిమంత బిశ్వశర్మకు చోటు లభిస్తుందని వినికిడి. హిమంత బిశ్వశర్మకు కీలకమైన రక్షణశాఖ కేటాయిస్తారని తెలుస్తున్నది. నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ) కూడా ప్రభుత్వంలో చేరనున్నందున జేడీ(యూ) పార్లమెంటరీ పార్టీ నేత రాంచంద్ర ప్రసాద్‌ సింగ్ - మరో నేత సంతోష్ కుశ్వాహాలను మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. ఎన్డీయే మిత్రపక్షాలైన శివసేన - టీడీపీలకు చెరో బెర్త్ లభించే అవకాశాలున్నట్లు సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం సహాయ మంత్రుల హోదాలో ఉన్నవారిలో పలువురికి మంత్రులుగా ప్రమోషన్ దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు. రెండు, అంతకన్నా ఎక్కువ శాఖలు చూస్తున్న వారికి కూడా ఈ విస్తరణతో భారం తగ్గనుందని అంటున్నారు. ఇక పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ కు పట్టణాభివృద్ధి శాఖ కేటాయించే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News