ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఘన విజయం తర్వాత బీజేపీ సీనియర్ నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా చేసిన ఓ కీలక ప్రకటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను అగ్గి మీద గుగ్గిలం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా... ఈ ప్రకటనపైనే చర్చ. అంతలా చర్చకు తెర లేపిన అంశం ఇంకేదో కాదు... యూపీ రైతుల రుణాలను మాఫీ చేస్తామని రాధా మోహన్ సింగ్ చేసిన ప్రకటనే. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో రైతుల రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ ప్రకటించింది. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది.
అయితే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో బరిలోకి దిగిన బీజేపీ... అక్కడ కొంత మేర సత్ఫలితాలనే సాధించింది. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రుణ మాఫీపై ప్రకటన చేయాలంటూ ప్రాధేయపడినట్లు నాడు వార్తలు వెలువడ్డాయి. అందుకు నరేంద్ర మోదీ ససేమిరా అన్నారని కూడా ఆ కథనాలు తెలిపాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో రైతుల రుణాలను మాఫీ చేసేందుకు ససేమిరా అన్న మోదీ... ఇప్పుడు యూపీ రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఎలా ప్రకటిస్తారన్నదే ఈ చర్చకు ప్రధాన కారణం. ఇదంతా బాగానే ఉన్నా... *యూపీకి మాత్రమే రుణాలు మాఫీ చేస్తే... మరి మా పరిస్థితి ఏమిటి? ఉత్తరాది బుద్ధి చూపించుకున్నారు*అంటూ జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ నిన్న ట్విట్టర్ వేదికగా గళం విప్పారు. పవన్ వ్యాఖ్యలు, డిమాండ్లలో న్యాయం లేకపోలేదన్న వాదన కూడా వినిపించింది. అయితే నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ శాసనసభలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి... నేల విడిచి సాము చేసినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
యూపీ రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రాధా మోహన్ సింగ్ ప్రకటనను గాలికొదిలేసిన కిషన్ రెడ్డి... తెలుగు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌పై పడిపోయారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై కిషన్ రెడ్డి పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు కూడా చేశారు. ఉత్తరప్రదేశ్ లో రైతుల రుణమాఫీ చేస్తామని బీజేపీ చెప్పిన మాట వాస్తవమే అయినప్పటికీ... అది కేంద్ర ప్రభుత్వ నిధులతో జరగదని, యూపీ రాష్ట్ర నిధులతోనే జరుగుతుందని ఆయన అన్నారు. ఇక ఆ తర్వాత పవన్ కల్యాణ్ ప్రస్తావనను ఎత్తుకున్న కిషన్ రెడ్డి... ఈ మధ్య కాలంలో కొత్త నాయకుడు వచ్చాడని, ఏ మాత్రం అవగాహన లేకుండా సోషల్ మీడియాలో తుచ్ఛ రాజకీయాలు చేస్తున్నాడంటూ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. తుచ్ఛ రాజకీయాల వల్ల ఉపయోగం లేదనే విషయాన్ని పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలని సూచించారు. కేవలం వార్తల్లో ఉండేందుకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం సరైన పద్ధతి కాదని కూడా పవన్‌కు కిషన్ రెడ్డి ఓ పెద్ద సలహానే ఇచ్చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/