తెలంగాణలో టెస్టులపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు !

Update: 2020-06-22 08:50 GMT
దేశంలో ఈ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా దేశంలో మొదట్లో లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చి , వైరస్ విజృంభణను కొంచెం అడ్డుకోగలిగినప్పటికీ , సడలింపుల తరువాత ఒక్కసారిగా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రోజురోజుకి భారీ స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి.  దీనితో ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. మహమ్మారి నిర్దారణ పరీక్షలు ఎక్కువగా చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి ఏ రీతిలో సాగుతుందన్న విషయాన్ని అర్థం చేసుకునే వీలుంటుంది. అందుకు భిన్నంగా అసలు పరీక్షలు చేసే విషయాన్నే వదిలేస్తే.. రోగ లక్షణాలు తెలిసేదెలా? అన్నది ప్రశ్న.

మహమ్మారి నిర్దారణ పరీక్షలు చేయటం ద్వారా.. వ్యాధి మొదట్లో ఉన్నప్పుడే గుర్తించే వీలు ఉంటుంది. దీని ద్వారా వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుంది. కానీ.. ఈ చిన్న విషయాన్ని కేసీఆర్ సర్కార్ వదిలేసింది. అయితే , కేసులు పెరిగేకొద్దీ అసలు విషయాన్ని పసిగట్టి టెస్టుల సంఖ్య పెంచుతుంది. అది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన తర్వాతే. ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం నిర్దారణ పరీక్షలు ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి.

తాజాగా ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి. మహమ్మారి కట్టడికి సంబంధించి దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ ప్రమాదకరంగా మారిందన్నారు. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర సర్కారు అనుసరించిన విధానమేనని, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. స్నేహితుడైన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వద్దన్నందుకే కేసీఆర్ నిర్దారణ పరీక్షలు నిర్వహించలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కరోనా టెస్టులు చేయకపోవటానికి కారణం మజ్లిస్ అని అందుకే కేంద్ర సహకారంతో తెలంగాణలో పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. ఢిల్లీలోనూ కేంద్రం జోక్యం చేసుకొని ఆరు లక్షల పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పిన కిషన్ రెడ్డి మాటలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ పెద్ద ఎత్తున నిర్దారణ పరీక్షలు చేయటానికి బీజేపీ రంగంలోకి దిగుతుందన్న విషయాన్ని తనదైన శైలిలో ఆయన సంకేతాలు ఇచ్చారని చెప్పాలేమో .
Tags:    

Similar News