కోదండ‌రాం సారు ఇలా వార్తల్లోకి ఎక్కాడేంటో?

Update: 2018-09-05 11:53 GMT
తెలంగాణ రాజ‌కీయాలు ఊహించ‌నంత హీట్‌ కు చేరాయి. ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముంద‌స్తు పేరుతో అన్నిరాజ‌కీయ పార్టీల‌ను త‌న పొలిటిక‌ల్ స్కెచ్‌లో భాగం చేసి ఎన్నిక‌ల‌పైనే దృష్టి పెట్టేలా చేసిన సంగ‌తి తెలిసిందే. అధికార పార్టీ అనూహ్యంగా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న తీరుతో విప‌క్షాలు సైతం త‌మ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో స‌హ‌జంగానే పొత్తుల ఎత్తులు తెర‌మీద‌కు వ‌స్తాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్‌-టీడీపీ దోస్తీ ఖ‌రారైంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా - వామ‌ప‌క్షాలు - జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి న‌డుస్తార‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్న స‌మ‌యంలో...తాజాగా మ‌రో కొత్త పొత్తు తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం బీజేపీతో క‌లిసి న‌డుస్తార‌నే ప్ర‌చారం.

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా పార్టీలు ఇత‌రులెవ్వ‌రితో క‌లువ‌నున్నాయ‌నే అంచ‌నాల నేప‌థ్యంలో ప‌లు మీడియాల్లో వ‌చ్చిన క‌థ‌నాల మేర‌కు...బీజేపీతో ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సార‌థ్యంలోని తెలంగాణ జ‌న‌స‌మితి జ‌ట్టుక‌ట్ట‌నుంద‌ట‌. ఈ మేర‌కు ఢిల్లీలో ప్రాథ‌మిక చ‌ర్చ‌లు పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. ఇత‌ర పార్టీల‌తో పొసిగే ప‌రిస్థితులు లేని నేప‌థ్యంలో ప్రొఫెస‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. తెలంగాణలో ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ ఈ విష‌యంలో అవాక్క‌వుతోంద‌ని అంటున్నారు. కోదండ‌రాంను పార్టీ పెట్ట‌కుండా ప్ర‌య‌త్నం చేసి - అనంత‌రం ఆయ‌న్ను పొత్తుపెట్టుకునేలా చూసి ఆఖ‌రికి విలీనం ప్ర‌తిపాద‌న‌ను కూడా తెర‌మీద‌కు తెచ్చిన అవేమీ వ‌ర్క‌వుట్ కాని నేప‌థ్యంలో టీజేఎస్ నాయ‌కుడితో గ్యాప్ మెయింటెన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోదండ‌రాం బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇందులో వాస్త‌విక‌త‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆది నుంచి క‌మ్యూనిస్టు భావాలు క‌లిగి ఉన్న కోదండ‌రాం బీజేపీని వ్య‌తిరేకిస్తుంటారు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు బీజేపీతో ఎలా పొత్తుపెట్టుకుంటార‌నేది మొద‌టి ప్ర‌శ్న‌. పైగా తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌భావం అంతంత‌మాత్ర‌మే అనేది సుప‌రిచితం. ఇప్పుడు గెలిచిన ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు త‌ప్ప ఆ పార్టీకి పెద్ద‌గా ఆద‌ర‌ణ లేదు. ఈ విష‌యం తెలిసిన కోదండ‌రాం త‌న స్వ‌భావినికి విరుద్ధం - పార్టీకి ప్ర‌యోజ‌నం కాని పొత్తును ఎంచుకోర‌నేది ఆయ‌న స‌న్నిహితుల మాట‌. మ‌రోవారం రోజుల్లో జ‌ర‌గ‌బోయే కీల‌క స‌మావేశంలో టీజేఎస్ పొత్తుల‌పై ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News