దీర్ఘాలోచనలో కోదండరాం.. వాట్ నెక్ట్స్..?

Update: 2018-10-12 09:25 GMT
ఎన్నికల వేళ పార్టీ పెట్టి ఒక ఊపు ఊపేద్దామనుకున్న కోదండరాంకు నైరాశ్యంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. మహా కూటమిలో తమదే పై చేయి అన్న ఆయన ప్రస్తుత గమ్యం ఏమిటో తెలియక డోలాయమానంలో పడ్డారు. కేసీఆర్ కు సమ ఉజ్జీ అవుతారని భావించి చతికలబడినట్లు ఉంది ఆయన పరిస్థితి.

తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరామ్ ఓ హీరో. జేఏసీ ఏర్పాటు చేసి కన్వీనర్ గా వ్యవహరించారు. కేసీఆర్ కూడా ఆయనకు సహకారం అందిస్తూ, ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు. కోదండరామ్ ఏం చెబితే అదే చేసేవారు ఉద్యమకారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కేసీఆర్ - కోదండరాం మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. సమావేశాల్లో కోదండరాంపై కేసీఆర్ బహిరంగంగానే విమర్శలు చేసేవారు. గతంలో సింగరేణి కార్మికులు ఘన విజయం సాధించిన తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఓ పుచికపుల్లలాగా కోదండరాంను తీసి పారేశారు.  వాడు అంటూ ప్రస్తావిస్తూ.. ‘‘వాడు చాలా చిన్నవాడు .. అతని కెపాసిటీ ఏమిటో నాకు తెలుసు. సాగర విహారం వీడు చేసిండా?’ అని ప్రశ్నించారు. దమ్ముంటే పార్టీ పెట్టి నేరుగా ఢీకొనాలని సవాల్ విసిరారు. పార్టీ పెట్టుడు అంటే పాన్ డబ్బా పెట్టడం అనుకుంటున్నావా అంటూ ఎద్దేవా చేశాడు.

ఇది జరిగిన తరువాత కోదండరామ్ పార్టీ పెట్టేందుకు తటపటాయించినా, ఎన్నికల నాటికి ఎలాగోలా పార్టీ పెట్టేశాడు. మహా కూటమితో జట్టుకట్టి బరిలోకి దిగారు. కేసీఆర్ కు సమ ఉజ్జీ అవుతారని భావించారు. కానీ, అలా జరగడం లేదని కోదండరాం దీర్ఘాలోచనలో పడిపోయారు. కాంగ్రెస్ కూడా కోరినన్ని సీట్లు ఇవ్వడం లేదు. టీజేఎస్ కు అంత సామర్థ్యం లేదంటూనే, సీట్ల వ్యవహారాన్ని తేల్చడం లేదు.

ఒకానొక దశలో కోదండరామ్ బీజేపీతో కలుస్తున్నట్లు  ప్రచారం కూడా జరిగింది. కానీ, ఆయన కాంగ్రెస్ తోనే కొనసాగుతున్నారు. రోజూ రావడం చర్చలు అంటూ కూర్చొని వెళ్లిపోవడం తప్ప సీట్ల సంగతిని మాత్రం తేల్చడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో హీరోగా వెలిగిన కోదండరాం - కేసీఆర్ కు సమ ఉజ్జీ అవుతారని అనుకున్నా - జీరోగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆయన తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
Tags:    

Similar News