సూటిగా నిలదీయరేం కోదండరాం

Update: 2015-12-13 08:25 GMT
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన కొందరిలో ప్రొఫెసర్ కోదండరాం ఒకరన్న విషయం తెలిసిందే. టీ ఐకాస పేరుతో రాజకీయ పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకురావటంతో పాటు.. మిగిలిన వర్గాల్ని ఒక కట్టు మీదకు తీసుకొచ్చి.. ఉద్యమాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లటం తెలిసిందే. అలాంటి కోదండరాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. కొంతకాలం విశ్వవిద్యాలయానికి వెళ్లి పాఠాలు చెప్పారు. ఈ మధ్యనే రిటైర్ అయిన ఆయన.. సామాజిక అంశాల మీద దృష్టి పెట్టారు. రైతుల ఆత్మహత్యల అంశంపై హైకోర్టుకు ఎక్కిన ఆయన.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాడుతున్నారు.

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై విపక్షాలన్నీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. కోదండరాం దీనిపై ఎలా స్పందిస్తారన్న ఆసక్తి వ్యక్తమైంది. టీ ఎన్జీవోస్  ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరైన కోదండరాంను ఇదే అంశంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా కోదండరాం ఆచితూచి వ్యాఖ్యలు చేశారు. ప్రలోభ పెట్టి పలు స్థానాలను ఏకగ్రీవం చేయటంపై ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి విధానం సరైనది కాదని చెప్పారు. పార్టీ ఎవరైనా.. అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేయటం మంచి పద్దతి కాదన్న ఆయన.. ఇలాంటివి రాజకీయ అస్థిరతకు కారణం అవుతాయన్నారు.

తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షాలకు అవకాశం లేకుండా ఆరు స్థానాల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా కావటంపై విపక్షాలు విరుచుకుపడుతుంటే.. అన్ని తెలిసిన కోదండరాం మాష్టారు మాత్రం ఆచితూచి మాట్లాడటం ఏమిటంటూ విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రభుత్వాల ధోరణిని తలపించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నా సూటిగా ప్రశ్నించలేరేం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోదండరాం ఎలాంటి వైఖరిని అనుసరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News