కాంగ్రెస్ వర్సెస్ కోదండరాం.. స్కెచ్ ఏంటి.?

Update: 2018-09-23 08:46 GMT
తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ ఎస్ 14 అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన అభ్యర్థులను ప్రకటించేసింది. అసంతృప్తులు వస్తే బలపడదామని బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తోంది. ఇక కాంగ్రెస్, టీడీపీ మహాకూటమిగా ఏర్పడి పొత్తు లెక్కలు తేలుస్తున్నాయి. కానీ ఇప్పటికీ సీట్లు సర్దుబాటు వ్యవహారంలో ముందుకు పోవడం లేదు. ఇందుకు టీజేఎస్ అద్యక్షుడు కోదండరాం డిమాండ్లే కారణమట.. కామన్ మినిమం ప్రోగ్రామ్ సెట్ చేయాలని.. దానికి తానే చైర్మన్ గా ఉంటానని కోదండరాం డిమాండ్ చేస్తున్నాడట..అయితే అంతా బాగానే ఉన్నా.. ఆ కామన్ మినిమం ప్రోగ్రాంను అమరవీరుల కోణంలో డిమాండ్ చేస్తున్నారట కోదండరాం. తొలిదశ - తుదిశ ఉద్యమం - ఇప్పటి తెలంగాణ అమరుల కుటుంబాల ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రోగ్రాం ఉండాలని కోదండరాం పట్టుదల అట. కానీ దీనివెనుక కోదండరాం ఆలోచన  వేరేలా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది..

నీళ్లు - నిధులు - నియామకాలు అనే తెలంగాణ ఉద్యమ నినాదాలను కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టాలని కోదండరాం డిమాండ్ చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చైర్మన్ హోదాలో రేపు మహాకూటమి విజయం సాధిస్తే పాలన మీద పట్టు సాధించాలని వ్యూహం పన్నినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లక్ష్యంతోనే ఆయన మహాకూటమిలో పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మహాకూటమిలోని పార్టీలన్నీ 25న సమావేశమవుతున్నాయి. ఇందులో ప్రధాన ఎజెండా కామన్ మినిమం ప్రోగ్రామట.. కాంగ్రెస్ వ్యూహం మాత్రం వేరే రకంగా ఉందట..అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయంతోపాటు ఉద్యోగ కల్పన వంటి అంశాల వరకూ కోదండరాంను పరిమితం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందట..   మిగిలిన అంశాలన్నింటి విషయంలో పెద్దన్న హోదాలో తామే లీడ్ చేయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉందట.. కానీ కోదండరాం మాత్రం కామన్ మినిమం ప్రోగ్రాం చైర్మన్ గా అన్నీ తానే చేసి ఫోకస్ కావాలని వ్యూహం రచించినట్టు కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.

25న నిర్వహించే మహాకూటమి సమావేశంలో తాము అనుకున్న విధంగా కోదండరాం వినకపోతే సీట్ల సర్దుబాటు విషయంలో సీరియస్ గా రియాక్ట్ కావాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారట.. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో చాలా ఆలస్యమైందని.. కాంగ్రెస్ అసహనంతో ఉందట.. ఒక వేళ సీట్ల విషయంలో కోదండరాం ఒప్పుకోకపోతే మహాకూటమి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ కోరనుందని సమాచారం. ఈ మేరకు పీసీసీ పెద్దలు డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. మహాకూటమి ఎత్తులు - ఎత్తుగడలు.. ఇకపై వేసే అడుగులన్నింటిని 25వ తేదీనే ప్రజలకు వెళ్లడించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉందట.. ఇప్పుడు కోదండరాం వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడే 25న కీలకం కానుంది. ఇందులో కాంగ్రెస్ స్టెప్ ఏంటి.? మరి దీనికి కోదండ ఏ నిర్ణయం తీసుకుంటారు? అనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ ల్ లో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News