కోహి'నూర్ అహ్మద్'..యంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

Update: 2022-06-15 11:30 GMT
అంతర్జాయతీ సమాజం కోణంలో చూస్తే అఫ్గానిస్థాన్ కల్లోల దేశమే కావొచ్చు. అక్కడ తాలిబన్ల వంటి ఉగ్రమూకలు రాజ్యమేలుతూ ఉండొచ్చు.. తమ ఛాందస భావజాలంతో ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉండొచ్చు. కానీ, అఫ్గాన్ లో క్రికెట్ ప్రతిభకు కొదవలేదు. అక్కడినుంచి మేటి బౌలర్లు పుట్టుకొస్తున్నారు.

మనం ఇప్పటివరకు స్పిన్ లో రషీద్ ఖాన్ ను చూశాం.ముజిబుర్ రెహ్మాన్ ను చూశాం. రషీద్ లెగ్ స్పిన్ తడాఖా.. ఇటీవల ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ట్రోఫీ అందించింది. ముజీబ్ అత్యంత ప్రతిభావంతుడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడితడు. రషీద్ కూడా సన్ రైజర్స్ తోనే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

వారి బాటలోనే నూర్ అహ్మద్ అఫ్గాన్ లో క్రికెట్ ప్రతిభకు కొదవలేదని చెప్పుకొన్నాం కదా..? అందులోనూ స్పిన్ ప్రతిభ అయితే తరగనంతగా ఉంది. ఓ రషీద్ ఖాన్, ముజిబుర్ రెహ్మాన్ లాగానే మరో కుర్రాడు దొరికాడు వారికి. అతడే నూర్ అహ్మద్ లకన్వాల్.

అంతర్జాతీయ క్రికెట్ లో గొప్ప ఆటగాడిగా ఎదిగే లక్షలున్నాయని ఇతడిపై అంచనాలున్నాయి. మంగళవారం జింబాబ్వేతో జరిగిన టి20 మ్యాచ్ లో నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 10 పరుగుల ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు నూర్ అహ్మద్. దీంతో "మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్"గా నిలిచాడు.

వయసు చిన్న.. ప్రతిభ మిన్న నూర్ అహ్మద్.. 2005 జనవరి 3న జన్మించాడు. అతడి ప్రస్తుత వయసు 17 ఏళ్ల 163 రోజులు. దీనికి ఒక రోజు ముందే.. అంటే 17 ఏళ్ల 162వ రోజు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నూర్ అహ్మద్ తొలి మ్యాచ్ లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అతి చిన్న వయసులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాధించినవాడిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

ఇతడి కంటే ముందు ఈ ఘనత అఫ్గాన్ ఆటగాడి పేరిటే ఉండడం గమనార్హం. అతడు రహ్మానుల్లా గుర్బాజ్. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అయిన గుర్బాజ్.. 2021 జనవరిలో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 127 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అతడికి కూడా ఇది తొలి అంతర్జాతీయ మ్యాచే కావడం విశేషం. వీరిద్దరి కంటే ముందు మెుహమ్మద్ ఆమిర్, షాదాబ్ ఖాన్ ఉన్నారు.
Tags:    

Similar News