పంచె క‌ట్టుకొని వెళ్లార‌ని ఆ మాల్‌ లో నో ఎంట్రీ!

Update: 2017-07-16 07:00 GMT
సంప్ర‌యాల‌ను తుంగ‌లో తొక్క‌టం ఒక ఎత్తు అయితే.. దాన్ని అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రించ‌టం మ‌రో ఎత్తు.  సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా వ‌స్త్ర‌ధార‌ణ త‌గ్గిపోవ‌టం ఇవాల్టి రోజున అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ఒక‌వేళ ఎవ‌రైనా సంప్ర‌దాయ వ‌స్త్రాలు ధ‌రించినా కాస్త వింత‌గా చూడ‌టం మామూలే. అయితే.. సంప్ర‌దాయ దుస్తుల‌తో ఒక మాల్‌ కి వెళ్లిన ద‌ర్శ‌కుడికి చేదు అనుభ‌వం ఎదురైంది.

పంచె క‌ట్టుకొని వెళ్లినందుకు మాల్ భ‌ద్ర‌తా సిబ్బంది ఆయ‌న్ను లోప‌ల‌కు అనుమ‌తించేందుకు నో చెప్పేశార‌ట‌. ప్ర‌ముఖ బెంగాలీ ద‌ర్శ‌కుడు అశిష్ అవికుంథ‌క్ ఈ విష‌యాన్ని త‌న ఫేస్ బుక్ ఖాతాలో వెల్ల‌డించ‌టంతో క‌ల‌క‌లం రేగింది. కోల్ క‌తాలో ఆధునిక సామ్రాజ్య‌వాద పోక‌డ‌లున్న క్ల‌బ్బుల్లోకి ఎంట్రీని నిరాక‌రించ‌టం కొత్తేం కాదు.

కానీ.. ధోవ‌తి క‌ట్టుకొని వెళ్లార‌న్న కార‌ణంగా మాల్ లోకి అనుమ‌తించ‌క‌పోవ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తాను ధోతి క‌ట్టుకొని వెళ్లినందుకు త‌న‌ను మాల్‌లోకి రాకుండా అడ్డుకున్నార‌ని.. ఎందుక‌ని అడిగితే భ‌ద్ర‌తా కార‌ణాల వ‌ల్ల అని చెప్పార‌ని స‌ద‌రు ద‌ర్శ‌కుడు చెప్పారు.

తాను ఇంగ్లిషులో మాట్లాడి.. గ‌ట్టిగా వాదించ‌టంతో త‌న‌ను మాల్ లోకి అనుమ‌తించిన‌ట్లుగా ఆయ‌న పేర్కొన్నారు. కోల్ క‌త్తా న‌గ‌రానికి నిస్సందేహంగా ప‌త‌న‌మే ప‌ట్టింద‌ని.. ధ‌రించే దుస్తుల‌ను అనుస‌రించి అంత‌రాలు సృష్టిస్తున్నార‌ని మండి ప‌డ్డారు. గ‌తంలో ప్రైవేటు క్ల‌బ్బుల్లోనే ఈ తీరు ఉండేద‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌లు వెళ్లే ప్ర‌దేశాల్లో కూడా ఇలాంటివి చేస్తున్నార‌న్నారు. ఇదంతా జాత్యాహంకార‌న్ని త‌ల‌పిస్తోంద‌ని ఆయ‌న స‌తీమ‌ణి దేబ‌లీన సేన్ విమ‌ర్శించారు. ఈ వాద‌న‌ను స‌ద‌రు మాల్ అధికారులు తోసిపుచ్చారు.

ధోతీతో రావ‌టంతో సెక్యూరిటీ అధికారులు కాసేపు నిలిపివేసి.. లోప‌లికి వ‌చ్చి అనుమ‌తి తీసుకున్న త‌ర్వాత లోప‌ల‌కు పంపార‌ని చెప్పారు. స‌ద‌రు ద‌ర్శ‌కుడి మాట‌ల‌కు.. మాల్ భ‌ద్ర‌తా సిబ్బందికి పెద్ద తేడా ఉన్న‌ట్లు క‌నిపించ‌దు. అయినా.. ధోవ‌తితో మాల్ లోకి వెళితే వ‌చ్చే న‌ష్ట‌మేంటి? అన్న సూటి ప్ర‌శ్న‌కు మాత్రం స‌ద‌రు మాల్ అధికారులు స‌మాధానం చెప్ప‌ని ప‌రిస్థితి.
Tags:    

Similar News