కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేది ఎవరంటే..

Update: 2016-10-05 09:20 GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తమ పార్టీకి కొత్త రాష్ట్రంలో అధికారం గ్యారెంటీ అనుకుంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. కానీ 2014 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ మరింత పతనమవుతుందేమో అన్న సందేహాలున్నాయి. ఐతే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తుందని.. ఐతే పార్టీని గెలిపించగల సత్తా తనకొక్కడికే ఉందని వ్యాఖ్యానించారు సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

అధికార తెరాస పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు. త్వరలోనే తాను తెలంగాణలోని అన్ని గ్రామాల్లో యాత్ర చేయబోతున్నట్లు.. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండున్నరేళ్ల పాలనలో కేసీఆర్ సరైన పథకం ఒక్కటీ ప్రవేశపెట్టలేదని.. ప్రభుత్వ పథకాల్ని సరైన రీతిలో అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి పథకాల్ని కేసీఆర్ సర్కారు పక్కనపెట్టిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో బాధపడుతోందని.. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల్ని అధినాయకత్వం గమనిస్తోందని.. త్వరలోనే నాయకత్వ మార్పు జరగొచ్చని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ ను తన చేతుల్లో పెట్టొచ్చని.. అందుకు తానే సమర్థుడినని కోమటిరెడ్డి పరోక్షంగా సంకేతాలిచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News