రాహుల్ తో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి భేటి.. పీసీసీ చీఫ్ ఎవరు?

Update: 2020-12-16 12:59 GMT
ప్రజల్లో పార్టీ బలోపేతం కోసం పాటుపడని నేతలంతా ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి కోసం కాస్త గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ లోని ఒక వర్గం ఆడిపోసుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారుతున్న వేళ నడిపించే నాయకుడి ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఢిల్లీలో అడుగుపెట్టారు. అధిష్టానం పెద్దలను కలుస్తూ పీసీసీ పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ ఇటీవలే హైదరాబాద్ లో మకాం వేసి కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నివేదిక అధిష్టానానికి సమర్పించారు. టీపీసీసీపై ఎవరీకైనా అభ్యంతరాలుంటే అధిష్టానానికి చెప్పుకోవచ్చని తెలియజేశారు.

టీపీసీసీ చీఫ్ ఎంపిక చివరి దశకు చేరుకోవడంతో నేతలంతా ఢిల్లీకి పయనమవుతున్నారు. టీపీసీసీ రేసులో అందరికీ కంటే ముందున్న ఎంపీ రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ఇద్దరూ ఢిల్లీలో ఉండడం ఆసక్తికరంగా మారింది.

సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటి అయ్యారు. తనను పీసీసీ చీఫ్ చేస్తే పార్టీని బలోపేతం చేస్తానని అమ్మను ఒప్పించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. మరోవైపు రాహుల్ గాంధీతో ఎంపీ రేవంత్ రెడ్డి భేటి అయ్యారు. టీపీసీసీని రేవంత్ కు కట్టబెట్టాలని రాహుల్ చూస్తున్నారనే టాక్ నడుస్తోంది.

కోమటిరెడ్డి తాజాగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ కోరారు. అనంతరం వెళ్లి కలిశారు. పార్లమెంట్ అనెక్స్ బల్డింగ్ స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా రాహుల్ తో భేటి అయ్యి రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్టు తెలిసింది.

ఇక అధిష్టానం పిలుపు మేరకు హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.

ఇక టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడిని సోనియానే ఎంపిక చేస్తారని టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరు ఈ పదవిని అలంకరిస్తారన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News