కేసీయార్ కు కోమటిరెడ్డి బంపరాఫర్

Update: 2021-08-08 13:35 GMT
కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. చౌటుప్పల్ మండల ఆఫీసులో మీడియాతో మాట్లాడుతు తన నియోజకవర్గంలో రోడ్లు, మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తానంటే ఇప్పుడే తన ఎంపి పదవికి రాజీనామా చేస్తానని కేసీయార్ కు ఎంపి బంపరాఫర్ ఇచ్చారు. నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని కేసీయార్ హామీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీకూడా చేసేది లేదన్నారు.

ఎన్నికల్లో పోటీచేసే విషయమై తనపై నమ్మకం లేకపోతే బాండ్ పేపర్ మీద రాసిస్తానని కూడా చాలెంజ్ చేశారు. వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం సుమారు రు. 1350 కోట్ల బకాయిలున్నట్లు ఎంపి చెప్పారు. బకాయిలను వెంటనే చెల్లించి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేసిన వర్కులకు వెంటనే డబ్బులు రాకపోవటంతో వడ్డీలు కట్టలేక కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నట్లు మండిపడ్డారు.

ప్రస్తుతం ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు చేయాలంటేనే ఎవరు ముందుకు రావటంలేదన్నారు. చౌటుప్పల్ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపి పాల్గొన్నారు. మామూలుగా మండల సర్వసభ్య సమావేశాలకు ఎంపిలు హాజరుకారు. కానీ వెంకటరెడ్డి మాత్రం హాజరవుతుంటారు. సమావేశమేదైనా, సమయం, సందర్భం లేకుండా సంచలన ప్రకటనలు చేయటంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పెట్టింది పేరు.

పార్టీలో కానీ ప్రభుత్వం మీదకానీ సంచలన ప్రకటనలు చేయటానికి బ్రదర్స్ ముందుంటారు. ఒకవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తునే మరోవైపు రేవంత్ తో తనకు ఎలాంటి వివాదాలు లేవని చెప్పటం వెంకటరెడ్డికే చెల్లింది. రేవంత్ ను మొదటినుండి వ్యతిరేకిస్తున్న కారణంగా సీనియర్ల నుండి తనకు సహకారం అందుతుందని ఎంపి భావించారు. అయితే ఎవరినుండి ఎలాంటి సహకారం అందకపోవటంతో తనకు రేవంత్ తో వివాదాలు లేవని సర్దుకుంటున్నారు.
Tags:    

Similar News