కాంగ్రెస్ కు కోమటిరెడ్డి అల్టీమేటం..

Update: 2019-06-22 06:16 GMT
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని ఆరోపించి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆయన అన్న సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాజాగా ఎంపీగా ఢిల్లీలోని పార్లమెంట్ లో ప్రమాణం చేసి తాను కాంగ్రెస్ ను వీడేది లేదని స్పష్టం చేశారు. దీంతో అన్నాదమ్ములు ఇద్దరూ చెరోపార్టీలో ఉంటారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ లో చోటుచేసుకున్న ఒక పరిణామం ఆగ్రహం తెప్పించింది. ఆయన మనస్తాపం చెంది పార్టీ మారేందుకు కూడా వెనుకాడనని సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలిసింది.

తెలంగాణ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆయనను నల్గొండ ఎంపీగా పోటీచేయించి గెలిపించుకుంది. ఇప్పుడు ఫ్లాప్ అయిన ఉత్తమ్ స్థానంలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని యోచిస్తోంది.

అయితే పీసీసీ రేసులో ప్రధానంగా సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరుతోపాటు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీంతో తనకు ప్రాధాన్యత ఇవ్వడంపై అగ్గిమీద గుగ్గిలమైన కోమటిరెడ్డి రెడ్డి.. తనకు పీసీసీ పీఠం దక్కకుంటే పార్టీ మారేందుకు కూడా సిద్ధమనేని అధిష్టానానికి సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. పీసీసీ పగ్గాలు ఇస్తేనే పార్టీలో ఉంటాను.. లేకపోతే ఉండను అని కోమటిరెడ్డి డిసైడ్ అయినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కోమటిరెడ్డి బెదిరింపులకు కాంగ్రెస్ అధిష్టానం లొంగి ఇస్తుందా.? లేకపోతే ఈయన పార్టీ మారుతారా అన్నది ఆసక్తిగా మారింది.

    

Tags:    

Similar News