కేసీఆర్ సెన్సేషన్.. కోమటిరెడ్డి కన్ఫ్యూజన్

Update: 2018-09-08 06:56 GMT
రెండు రోజుల కిందట తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ సంచలనం  సృష్టించగా.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి అలజడి సృష్టించారు. కేసీఆర్ 105 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించి సెన్సేషన్ సృష్టిస్తే... పీసీసీ, ఏఐసీసీతో సంబంధం లేకుండా కోమటిరెడ్డి తమ ఫ్యామిలీ సీట్లను ప్రకటించుకుని కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ సృష్టించారు.
    
మాజీ మంత్రి, నల్లగొండ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి - ఎఐసిసితో సంబంధం లేకుండానే సీట్లు డిక్లేర్ చేసుకుని సంచలనం రేపారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్లగొండ నుంచి పోటీ చేస్తానని, తన తమ్ముడైన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి బరిలోకి దిగుతారని శుక్రవారం కోమటిరెడ్డి నల్లగొండలో ప్రకటించారు. తాము ఇద్దరమూ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తామని ప్రకటించారు.
    
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొత్తులు - సీట్ల కేటాయింపులపై గాంధీ భవన్‌ లో పార్టీ నేతలతో చర్చిస్తున్న సమయంలోనే కోమటిరెడ్డి ఈ సంచలనానికి దిగారు. కోమటిరెడ్డి ప్రకటన కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపింది. అసెంబ్లీ రద్దు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. కానీ తొలి రెండు సీట్లను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకపక్షంగ ప్రకటించడం పట్ల కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో పిసిసి సిద్ధం చేసిన జాబితాను ఎఐసిసి ఆమోదించాలి. ఆ తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తారు. కానీ ఇలా ఎవరికి తోచినట్లు వారు అభ్యర్థులను ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ గాంధీభవన్ వర్గాలు సైతం ముక్కుమీద వేలేసుకుంటున్నాయి.
    
కోమటిరెడ్డి ప్రకటనతో సమస్య ఎక్కడొచ్చిందంటే.. ఆయన సీటు విషయంలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మునుగోడు నుంచి తన సోదరుడు పోటీ చేస్తారనడమే వివాదం రేపింది. ఎందుకంటే.. మనుగోడులో దివంగత నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిరెడ్డి నియోజకవర్గ ఇన్ ఛార్జీగా ఉన్నారు. ఆమెకు టికెట్ ఆశిస్తున్నారు. కానీ గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడుపై కన్నేశారు. మునుగోడులో సభలు - సమావేశాలు జరిపి హల్ చల్ చేస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ నల్లగొండ - మునుగోడు అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని ప్రకటనలు గుప్పించడం వివాదాస్పదంగా మారింది. ఉత్తమ్ దీనికి ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News