చేర్యాలని మరచిన టిఆర్ ఎస్..ప్రచారంలో కోమటిరెడ్డి విమర్శలు!

Update: 2020-01-18 13:17 GMT
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరో రెండురోజుల్లో ముగియడంతో ప్రధాన పార్టీలు క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ , టి ఆర్ ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార టీఆర్ ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక చేర్యాల అనాథగా మారిపోయందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

చేర్యాల బాగోగులను పట్టించుకున్న నాథుడే లేడని మండిపడ్డారు. చేర్యాల పట్టణ అభివృద్ధి కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏయే పనులు కేటాయించిందో, ఏయే విభాగాలు పనులకు నోచుకోలేదో ప్రజలకు తెలుసు అని స్పష్టంచేశారు. పోరాటాల చరిత్ర ఉన్న చేర్యాలను టీఆర్ఎస్ అణామకం చేసిందని విమర్శించారు. పట్టణం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లేదని, దీంతో నిరుద్యోగ యువత కొలువు కోసం కళ్లప్పగించి చూస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం తనకు కమీషన్లు అందజేసే ప్రాజెక్టుల వైపే చూస్తున్నారే తప్ప, ఉద్యోగాలను మాత్రం భర్తీ చేయాలని అనుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 20వ తేదీతో సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. 25వ తేదీన ఓట్లను లెక్కించి, ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.
Tags:    

Similar News