త్యాగానికి సిద్ధ‌మైన కోమ‌టిరెడ్డి!

Update: 2018-02-07 05:46 GMT
న‌ల్గొండ జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిక‌ర మ‌లుపు తిర‌గ‌నున్నాయా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది. ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన కాంగ్రెస్ నేత బొడ్డుప‌ల్లి శ్రీ‌నివాస్ ఉదంతంలో అధికార పార్టీ డిఫెన్స్ లో ప‌డింది. కాంగ్రెస్ నేత హ‌త్య‌లో తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌ల హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ప్ర‌జ‌ల్లోకి బలంగా వెళ్ల‌టం ఆ పార్టీకి ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెబుతున్నారు. ఇలాంటి వేళ‌.. కాంగ్రెస్ నేత‌లు కీల‌క నిర్ణ‌యం ఒక‌టి తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

హ‌త్య‌కు గురైన బొడ్డుప‌ల్లి శ్రీ‌నివాస్ ఉదంతంలో అధికార‌ప‌క్షాన్ని మ‌రింత ఇరుకున పెట్టేందుకు వీలుగా ఆయ‌న స‌తీమ‌ణి.. న‌ల్గొండ మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ ల‌క్ష్మిని న‌ల్గొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో దించాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

బొడ్డుప‌ల్లి శ్రీ‌నివాస్ హ‌త్య‌లో న‌కిరేక‌ల్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కీల‌క పాత్ర ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ హ‌త్య కేసులో నిందితులు హ‌త్యకు ముందు.. త‌ర్వాత కూడా ఎమ్మెల్యే వేముల‌తో బంధువుల‌తో ఫోన్లో మాట్లాడిన డేటా బ‌య‌ట‌కు రావ‌టంతో.. ఈ హ‌త్య‌కు టీఆర్ ఎస్ నేత బాధ్యులుగా ఆరోపిస్తున్నారు. దీనిపై ధీటుగా స్పందించే విష‌యంలో టీఆర్ ఎస్ నేత‌లు కిందామీదా ప‌డుతున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌లో అధికార‌పార్టీపై మ‌రింత ఒత్తిడిని పెంచేందుకు వీలుగా కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. బొడ్డుప‌ల్లి శ్రీ‌నివాస్ స‌తీమ‌ణికి రానున్న ఎన్నిక‌ల్లో పార్టీ సీటు కేటాయిస్తే.. కోమ‌టి రెడ్డికి ఇబ్బంది. ఎందుకంటే.. ప్ర‌స్తుతం న‌ల్గొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అధికార పార్టీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేందుకు కోమ‌టిరెడ్డి  త‌న సీటును త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన శ్రీ‌నివాస్ హ‌త్య నేప‌థ్యంలో రాజ‌కీయంగా కీల‌క నిర్ణ‌యానికి కోమ‌టిరెడ్డి సానుకూలంగా ఉన్నారు. త‌న సీటును త్యాగం చేసి.. తాను న‌ల్గొండ ఎంపీ స్థానం నుంచి బ‌రిలోకి దిగుతాన‌ని పార్టీ ముఖ్య‌నేత‌ల‌కు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. బొడ్డుప‌ల్లి శ్రీ‌నివాస్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌టానికి ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీని పిల‌వాల‌ని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ప‌రామ‌ర్శ వేళ‌లోనే.. రాహుల్ నోటి వెంట ల‌క్ష్మీని ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ప్ర‌క‌ట‌న చేయించాల‌నుకోంటోంది. అదే జ‌రిగితే.. న‌ల్గొండ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News