కొణతాల.. రాజకీయం మరీ ఇంత కామెడీనా!

Update: 2019-03-28 15:30 GMT
ఐదేళ్లలో ఒక రాజకీయ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిన నేతలను కూడా జనం క్షమించేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఒక పార్టీ  నుంచి మరో పార్టీలోకి చేరిపోయిన వాళ్లను కూడా మారిన పార్టీ తరఫు నుంచి గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గత ఎన్నికల ముందు చాలా మంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకో..తెలుగుదేశం లోకో చేరి.. ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారే. ఇక ఫిరాయింపుదారుల సంగతి సరేసరి.

 ఫిరాయింపుదారుల్లో చాలా మందికి చంద్రబాబు నాయుడే ఎమ్మెల్యే టికెట్  ఇవ్వని పరిస్థితి.  ఎందుకంటే అలాంటి రాజకీయాలను జనాలను ఛీత్కరించుకుంటారేమో అని  భయం. మరీ తనకు అభ్యర్థులు లేని చోట తప్ప..చాలా మంది ఫిరాయింపుదారులకు చంద్రబాబు నాయుడు హ్యాండిచ్చారు.

ఇలా రాజకీయ నేతలే ఫిరాయింపును ప్రజలు అసహ్యించుకుంటారేమో అని భయపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ రాజకీయంలో కూడా కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉంది.  ప్రజలు నవ్వుకుంటారేమో అనే భయం లేకుండా వీళ్లు తెగించి రాజకీయం చేస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు ముందు వరసలో ఉన్నారు కొణతాల రామకృష్ణ. ఈయన అటూ ఇటూ గెంతుతూనే ఉన్నారు.

రెండు వారాల్లో ఒక సారి చంద్రబాబు నాయుడు తిట్టి - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను కలిసి - మళ్లీ చంద్రబాబు నాయుడును పొగిడి.. ఇప్పుడు లోకేష్ వెనుక నిలబడి ప్రసంగాలు వింటున్నారీయన! మార్చి పద్నాలుగో తేదీన కొణతాల రామకృష్ణ అనకాపల్లిలో తన వాళ్లతో సమావేశం నిర్వహించి చంద్రబాబు నాయుడు చడామడా తిట్టారు. అలాంటి కొణతాల తెలుగుదేశం పార్టీ ప్రచార రథం మీద కనిపిస్తున్నారు. దీన్ని చూసి నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉన్నారట ఆయన అనుచరగణం.

 మార్చి పద్నాలుగో తేదీన బాబును తిట్టి - మార్చి ఇరవై నాలుగో తేదీన తన మద్దతు చంద్రబాబుకే అని కొణతాల ప్రకటించారు.  తనతో రమ్మని అనుచరులకు పిలుపునిచ్చారు! ఏజెన్సీలో లోకేష్ బాబు ప్రచారానికి రాగా..అక్కడ చంద్రబాబును నోరారా పొగిడారు కొణతాల.

ఇటీవలే ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా కలిశారు. ముందుగా కొణతాలకు తెలుగుదేశం పార్టీ వెల్కమ్ చెప్పింది. అయితే అప్పుడు కొణతాల వెళ్లలేదు. ఈయన కోసం ఎంపీ టికెట్  ను కూడా ఇవ్వడానికి రెడీగా ఉందట తెలుగుదేశం. అయితే అప్పుడు కొణతాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ట్రయల్స్ వేశారు. వైసీపీ నేతలను కలిశారు. జగన్ తో కూడా వెళ్లి సమావేశం అయినట్టుగా  ఉన్నారు. అయితే ఎందుకో కొణతాల విషయంలో జగన్ ఆసక్తి చూపలేదు. వచ్చి పని చేసుకోవచ్చు అని చెప్పారట. ఎలాంటి హామీ ఇవ్వలేదు.

అప్పటికే వైసీపీలోకి వెళ్లడానికి కొణతాల బాబును తిట్టేశారు. వైసీపీలో అవకాశం దక్కకపోవడంతో మళ్లీ ఇప్పుడు బాబును పొగుడుతున్నారు. పక్షం రోజుల్లో ఈయన మాట తీరులో వచ్చిన మార్పు ఇది. ఇప్పటికే ఔట్ డేటెడ్ అనిపించుకుంటున్న కొణతాల ఈ తీరుతో మరింత ప్రహసనం పాలయ్యారు!

Tags:    

Similar News