టీడీపీలోకి కాదు… వైఎస్సార్సీపీలోకి అట!

Update: 2019-03-15 10:53 GMT
ఎన్నికల ముందు రాజకీయ నేతలు నిమిషాల మీద తమ తమ అభిప్రాయాలను మార్చేసుకొంటూ ఉన్నట్టున్నారు. తమకు సీటు ఇచ్చే పార్టీనే చాలా మంది పార్టీ అవుతోంది వీళ్లకు. అంతకు మించి వేరే ఆలోచనే లేకుండా వీరు పార్టీలు మారేస్తూ ఉన్నారు.

ముందుగా ఒక పార్టీ అధినేతను కలవడం లేదా  పార్టీ ప్రతినిధులతో చర్చించడం అదీ కాదంటే.. సదరు పార్టీలోకి చేరుతున్నట్టుగా లీకులు ఇవ్వడం.. వీటిని ఆసరాగా చేసుకుని మరో పార్టీలో తాము కోరినది సాధించుకోవడం.  ఇదీ రాజకీయ నేతల తీరు. ఈ విషయంలో వారు నిర్మొహమాటంగా తమ అసలు  రూపాన్ని బయటపెట్టేసుకొంటూ ఉన్నారు.

ఇలాంటి కథే కొణతాల రామకృష్ణది కూడా. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన కొణతాల గత ఎన్నికల అనంతరం.. రాజకీయంగా అచేతనవస్థలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  అయితే ఈయన సీనియారిటీకి ఇతర పార్టీలు కాస్త గౌరవాన్ని ఇస్తూ ఉన్నాయి. అందులో భాగంగా కొణతాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా కొన్నాళ్ల కిందట వార్తలు వచ్చాయి. 

అయితే అందుకు జగన్ నో చెప్పారని ప్రచారం జరిగింది. దీంతో వైఎస్సార్సీపీలోకి చేరాలని ఉన్నా.. కొణతాల చంద్రబాబుతో సమావేశం అయ్యారు. తెలుగుదేశంలోకి ఈయన చేరడం ఖరారు అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కానీ.. మళ్లీ చంద్రబాబు కాల్స్ కు స్పందించలేదట కొణతాల. దీంతో ఈయన అటు వైపు వెళ్లడం క్యాన్సిల్ అయ్యింది.

ఇక తెలుగుదేశంలోకి చేరకపోయినా.. ఇప్పుడు కొణతాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. గతంలో కొణతాల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధించిన బహిష్కరణను ఎత్తేయనున్నారని - ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని వార్తలు  వస్తున్నాయి. రేపే ఇందుకు సంబంధించి ప్రకటన రాబోతోందని సమాచారం.

మొత్తానికి కొణతాల అటు కాదంటే ఇటు ఇటు కాదంటే అటు ఈజీగానే మారుతున్నారు. మరి జనాలు ఈయనను ఎలా రిసీవ్ చేసుకుంటారో!
Tags:    

Similar News