కొణ‌తాల కొత్త ఉద్య‌మం మొద‌లెట్టాడు బాబు

Update: 2016-06-16 11:07 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఎదుర్కుంటున్న‌ ఉద్య‌మాల ఘాటులో మ‌రో ఎపిసోడ్. మొద‌ట రాయ‌ల‌సీమ‌కు అభివృద్ధిలో పెద్ద‌పీట డిమాండ్లు - ఆ త‌ర్వాత‌ కాపుల‌కు రిజ‌ర్వేష‌న్‌ ఉద్య‌మం - అనంత‌రం ఎస్సీ రిజ‌ర్వేష‌న్ పోరాటం - ప్ర‌స్తుతం మ‌ళ్లీ కాపులకు కోటా పోరుతో క‌ల‌వ‌రం చెందుతున్న చంద్ర‌బాబు ముందుకు ఇంకో ఉద్య‌మం వ‌చ్చిప‌డింది. అదే ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు. ఇది ప్రారంభించింది ఎవ‌రో కాదు.  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ!

తెలుగుదేశంలో చేరేందుకు స‌ర్వం సిద్ధం చేసుకొని చంద్ర‌బాబును కూడా క‌లిసిన కొణ‌తాల ఆ త‌ర్వాత వెన‌క్కు త‌గ్గి త‌న అనుచ‌రుల‌ను పంపించిన సంగ‌తి తెలిసిందే. అయితే రాజ‌కీయ ప్ర‌స్థానంపై డోలాయామ‌నంలో ప‌డిన కొణ‌తాల తాజాగా ఉత్తరాంధ్ర ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను నెత్తికెత్తుకున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన కార్యక్రమానికి సబ్బవరంలో కొణ‌తాల‌ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2009 ఫిబ్రవరి - 21న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి వేసిన శిలాఫలకాన్ని గోదావరి జలాలతో శుద్ధి చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగు - తాగునీటి కష్టాలను పరిష్కరించటంలో అప్పటి పాల‌కులు పూర్తిగా విఫలమ‌య్యార‌ని అన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చూపిన చొరవను కొణ‌తాల‌ కొనియాడారు. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రకటించిందని అయితే ఇప్పటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంత్రి సాధన సమితి ఏర్పాటు ద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల‌ను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ముఖ్య ఉద్ధేశమని కొణ‌తాల తెలిపారు. ఇందుకోసం త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే 8లక్షల ఎకరాలకు సాగునీరు - 1200 గ్రామాలకు తాగునీరు అందించవచ్చన్నారు. పరిపాలనా అనుమతి లభించిన తరువాత నిర్లక్ష్యానికి గురైన పథకం ఇదొక్కటేన‌ని కొణ‌తాల‌ అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులంతా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
Tags:    

Similar News