రాజ‌కీయ స‌న్యాసానికి రెడీగా ఉండు కేటీఆర్‌

Update: 2018-09-25 16:11 GMT
తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌ - అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన ముంద‌స్తు ఎన్నిక‌లు సృష్టించిన రాజ‌కీయాలు క‌లక‌లం తారాస్థాయికి చేరింది. ఆ పార్టీకి చెందిన కొండా సురేఖ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఈ రోజు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌ లో జరిగిన విలేకరుల సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కు రాసిన‌ బహిరంగ లేఖను చ‌దివి వినిపించారు. అనంత‌రం ఆమె విరుచుకుప‌డ్డారు. తాను ప్రెస్‌ మీట్ పెట్టి అడిగిన ప్రశ్నలకు 12 రోజులైనా సమాధానం లేదని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తాను క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించలేదు అని కొండా సురేఖ తెలిపారు. ఏ కారణం లేకుండా నాకు టికెట్ ఇవ్వకుండా గెంటేశారు. మంత్రివర్గంలోకి తీసుకోకున్నా సర్దుకుపోయాను అని తెలిపారు. బీసీ మహిళ అయిన త‌నకు నమ్మకద్రోహం జరిగిందని కొండా సురేఖ ఆవేదన వ్య‌క్తం చేశారు.

నాలుగేళ్ళలో కేసీఆర్ ప్రజాప్రతినిధులకు అపాయింట్‌ మెంట్ ఇవ్వలేదని కొండా సురేఖ‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు గంటలు నిరీక్షిస్తే సోనియా - రాహుల్‌ ను కూడా కలవొచ్చు..కానీ ఇక్కడ కనీసం కేటీఆర్ కూడా అపాయిట్ మెంట్ ఇవ్వరని కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికే ఎక్కుల పదవులు దక్కాయన్నారు. టీఆర్ ఎస్ పార్టీ పెట్టినప్పుడు కవిత - కేటీఆర్ - సంతోష్‌ లు ఎక్కడ ఉన్నారన్నారు. బంగారు కొండ అన్న కోదండరాంను ఇప్పుడు చవట - దద్దమ్మ అంటున్నారన్నారని విమర్శించారు. కవిత బంగారు బోనం ఎత్తితే బంగారు తెలంగాణ వచ్చినట్టేనా? అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేసీఆర్‌ కు మందు గోలీలు ఇచ్చే వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన మొత్తం అవినీతి పాలన అని అన్నారు. కేటీఆర్ కాంట్రాక్టర్ల వద్ద ఎంత కమిషన్ తీసుకున్నారో చెప్పండి అని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేని అసమర్థ పాలన కేసీఆర్‌ ది అని కొండా సురేఖ‌ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కేబినెట్‌ లో మహిళలకు స్థానం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ కు రాలేదన్నారు. అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ ఎక్కడా న్యాయం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన విద్యార్థులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓడిపోతామనే భయంతోనే ముందస్తుకు వెళుతున్నారన్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాల వాళ్ళ ప్రజల సొమ్ము వృధా అవుతోందన్నారు. కేసీఆర్ పాలనలో డబ్బు ఇవ్వనిదే ఏ పని జరగదన్నారు. గట్టయ్య ఆత్మ శాంతించాలంటే టీఆర్ ఎస్ ను ప్రజలు ఓడించాలన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించిన మంత్రి కేటీఆర్ స‌న్యాసానికి సిద్ధంగా ఉండాల‌ని సురేఖ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News