మురికి కాలువ‌లో దిగి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నిర‌స‌న‌

Update: 2022-07-05 07:23 GMT
త‌న‌దైన శైలిలో త‌ర‌చూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తుంటార‌ని నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పేరుంది. గ‌త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చోటు ఆశించిన ఆయ‌న‌కు ప‌ద‌వి దక్క‌క‌పోవ‌డంతో తీవ్రంగా నిరాశ చెందార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల గుండెపోటుకు గురై చెన్నై అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స కూడా పొందారు.

ప్ర‌స్తుతం కోలుకోవ‌డంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో చురుకుగా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకుంటున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డప గ‌డ‌ప‌కు వెళ్తున్నారు.

కాగా ఆయ‌న తాజాగా వినూత్నంగా త‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఉమ్మారెడ్డిగుంటలో గత కొంతకాలంగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది, రైల్వే అధికారులు అనుమతి లేకపోవడంతో డ్రైనేజీ నిర్మాణం నిలిచిపోయింది. దీంతో అధికారులు పట్టించుకోవడం లేదని మురికి కాలువలోకి దిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి స్వయంగా ఎమ్మెల్యేనే డ్రైనేజీలోకి దిగి నిరసన వ్యక్తం చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

గెలిపించిన ప్రజలు సమస్యలు పరిష్కరించడం లేదని తనను ప్ర‌జ‌లు నిలదీస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర‌రెడ్డి మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యానికి తాను కూడా బాధ్యుడన‌ని అని తెలిపారు. రైల్వే అధికారుల సమన్వయం లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని అన్నారు.

ఎమ్మెల్యే ఆగ్ర‌హంతో స్పందించిన రైల్వే అధికారులు జూలై 15 లోపు పనులు మొదలు పెడతామని ఆయ‌న‌కు హామీ ఇచ్చారు. సమస్య పది రోజుల్లో పరిష్కారమవ్వాలని, లేకపోతే ఈసారి డ్రైనేజీలో పడుకొని నిరసన వ్యక్తం చేస్తానని కోటంరెడ్డి అధికారుల‌ను హెచ్చరించారు.

ఉమ్మారెడ్డి గుంటలో కొన్నేళ్లుగా మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో.. ప్ర‌జ‌లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే మురుగునీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే వరకు కదలనంటూ మురుగు కాల్వలో నుంచున్నారు. దీంతో అధికారులు దిగిరాక త‌ప్ప‌లేదు.
Tags:    

Similar News