షాకింగ్ : బీజేపీలోకి కొత్త‌ప‌ల్లి గీత‌?

Update: 2018-02-09 08:23 GMT
విభ‌జ‌న హామీల అమ‌లు కోసం - ఏపీకి న్యాయం జ‌ర‌గాల‌ని పార్ల‌మెంటులో టీడీపీ - వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళ‌న‌ల‌పై అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ అభివృద్ధిపై టీడీపీ - వైసీపీల‌కు చిత్త‌శుద్ధి లేద‌న్నారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వలేమ‌ని బీజేపీ తేల్చి చెప్పి ....ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన రోజు ఆందోళ‌న‌లు ఎందుకు చేయ‌లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. పార్ల‌మెంట్ లో వారు చేస్తున్న నిర‌స‌న‌లు ఓ డ్రామా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవ‌లం ఏపీ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు వీరంతా డ్రామా ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు ఈ ర‌కంగా ఆందోళ‌న చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల కోసం కాద‌ని అన్నారు. ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకుంటూ నాట‌కాలు ఆడుతున్నార‌ని అన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల‌న్నీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. హోదా కంటే ప్యాకేజీ మంచిద‌ని అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేసి - స‌న్మానాలు కూడా చేయించుకున్నార‌ని, ఇపుడు ప్యాకేజీ బాగోలేద‌ని చెప్ప‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌ని ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం - అమ‌రావ‌తికి కేంద్రం ఇచ్చిన నిధుల‌కు లెక్క ఎందుకు చూపించ‌డం లేదని ఆమె ప్ర‌శ్నించారు.

రెండంకెల వృద్ధి రేటు అని చెప్పుకునే వారు మోదా కావాల‌ని ఎలా ప్ర‌శ్నిస్తార‌ని గీత అన్నారు. గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల్లో  కేంద్రం ఇచ్చిన‌ నిధుల‌కు రాష్ట్రం ఎందుకు లెక్క చెప్ప‌డం లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. త‌న‌ నియోజ‌క‌వ‌ర్గానికి కేంద్రం రూ.25 వేల కోట్ల నిధులిచ్చింద‌ని....దానికి సంబంధించి ఒక్క పైసాకు లెక్క లేదని.....తాను అడిగినా కూడా ప్ర‌భుత్వం నుంచి స‌మాధానం లేద‌ని అన్నారు. అటువంటిది ఈ రోజు పోరాటం చేయాల‌ని చెప్ప‌డంలో అర్థం లేద‌న్నారు. కేంద్ర జీడీపీ క‌న్నా రాష్ట్ర జీడీపీ 5.5 శాతం ఎక్కువుంద‌ని....అటువంటిది ఇప్పుడు స్పెష‌ల్ స్టేట‌స్ కావాలని ఎంపీలు కోర‌డంలో అర్థ‌మేమిట‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో చాలా కంపెనీలు పెట్టుబుడులు పెట్టాయ‌ని టీడీపీ ప్ర‌భుత్వం చెబుతోంద‌ని, ఎంత పెట్టుబ‌డులు పెట్టార‌న్న సంగ‌తి ఎవ‌రికీ తెలియ‌ద‌న్నారు. ఎన్ని ఎంవోయూలు కుదుర్చుకున్నారు, ఎంత పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌న్న అంశాల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. వీట‌న్నింటిపై క్లారిటీ ఇస్తే ...తాను టీడీపీతో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు.

కేంద్రాన్ని తిట్ట‌కుండా కేవ‌లం టీడీపీని - చంద్ర‌బాబును జ‌గ‌న్ తిడితే ఏం లాభం లేద‌న్నారు. బీజేపీ ప్ర‌భుత్వం బాగా ప‌నిచేస్తోంద‌ని విజ‌య‌సాయిరెడ్డి గారు పార్ల‌మెంటులో చెబుతార‌ని,....మిగ‌తా వైసీపీ ఎంపీలు పార్ల‌మెంటు బ‌య‌ట ప్ల‌కార్డులు ప‌ట్టుకొని నిలుచుంటార‌ని ఎద్దేవాచేశారు. వైసీపీ ఎంపీలు ఎటువైపున్నారు, బీజేపీపై వారి వైఖ‌రి ఏమిట‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త లేద‌న్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు ....అఖిల‌ప‌క్షాన్ని ఏర్పాటు చేసి ...ఆంధ్రుల హ‌క్కుల కోసం ఢిల్లీ వ‌చ్చిన రోజు...వారితో క‌లిసి పోరాడ‌తాన‌ని, ఆంధ్ర రాష్ట్రం కోసం తాను ఏ త్యాగం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని అన్నారు. టీడీపీ - వైసీపీల‌పై గీత వ్యాఖ్య‌లు చూస్తుంటూ ఆమె బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతోంద‌ని, త్వ‌ర‌లోనే ఆమె బీజేపీలో చేరే అవ‌కాశ‌ముంద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ వార్త‌ల్లో నిజానిజాలు తెలియాలంటే మ‌రి కొంత‌కాలం వేచి చూడక త‌ప్ప‌దు.


Tags:    

Similar News