సింహం సింగిలే...మాకు 100 సీట్లు

Update: 2018-08-28 16:35 GMT
‘‘సింహం సింగిల్‌ గానే వస్తుంది... అంతేకానీ... భావసారుప్యత లేని పార్టీతో పొత్తు పెట్టుకోం... ఎన్నికలు - రాజీనామాలు - అత్యధిక మెజార్టీతో గెలవడం టీఆర్ ఎస్‌ పార్టీకి కొత్తేమీ  కాదు... బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనడం పనికిమాలిన చర్య... చిల్లర - మల్లర వ్యాఖ్యలు... మోదీతో అంటు లేదూ సొంటు లేదు... బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు భావసారూప్యత కూడా లేదు... ఒక ప్రధానిని ఒక రాష్ట్ర సీఎంగా మాత్రమే సీఎం కేసీఆర్‌ కలిశారు, రాష్ట్రంలో అభివృద్ధి పనులకు - నిధులకు విజ్ఞప్తి చేశారు... అంతేకాని రాజకీయమేమీ లేదు..’’ అని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్య‌క్తం చేశారు. కొంగర కలాన్‌ లో వచ్చేనెల 2న నిర్వహించనున్న ప్రగతి నివేదిన సభ ఏర్పాట్లను హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి మంగళవారం మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. సభా వేదిక - పార్కింగ్‌ - హెలిప్యాడ్‌ తో పాటు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

పొత్తు పెట్టుకునేంత అవసరం తమకేమీ లేదని, ప్రధానిని కలిస్తే కూడా రాజకీయం చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. తాను హైదరాబాద్‌ లో ఉంటే ఢిల్లీలో ఉన్నానని ప్రచారం చేశారని కొట్టిపారేశారు. ‘‘ నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్నాం. ప్రజలతో తిరుగుతున్నాం. ఏళ్ల‌ తరబడి ఉన్న సమస్యలను తీర్చాం. ప్రజల్లో లేని ప్రతిపక్షాలే. ఇన్ని రోజులు దూరంగా ఉండి ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ముందస్తు ఎన్నికలంటూ హడావుడి చేస్తున్నారు. ఏ ఎన్నికలైనా... ఎన్నికలు ఎప్పుడొచ్చినా... టీఆర్ ఎస్‌ 100 అసెంబ్లీ స్థానాలు - 16 పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకుంటుంది...’ అని మంత్రి  కేటీఆర్ అన్నారు. నోట్ల కట్టలతో దొరికి జైళ్ల చిప్పకూడు తిని ఇప్పుడు నీతి వ్యాఖ్యాలు పలుకుతున్నారని రేవంత్ రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. ముందస్తుపై చర్చ లేనే లేద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు టీఆర్ ఎస్‌ పాలనపై నమ్మకం ఉందని - రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే సీఎం కేసీఆర్‌ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చిల్లర, మల్లర రాజకీయాలు చేస్తుంటే సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారని, ఎన్నికలకు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారన్నారు. అంతేకానీ ముందస్తు ఎన్నికలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. శాసనసభ రద్దు చేసే ముందు కేబినెట్‌ సమావేశం కావాల్సి ఉంటుందని - కేబినెట్‌ లో చర్చ తర్వాత నిర్ణయం తీసుకుంటారన్నారు. కానీ ఇప్పుడే ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం ఉత్తిదేనని కొట్టిపారేశారు. ఎక్కడైనా ప్రభుత్వానికి దింపి - అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు ఉబలాటపడతాయని - కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలకు పోదామంటూ మేం ఇంకా సిద్ధంగా లేమని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న తాము ప్రజల దగ్గరకు వెళ్లి తేల్చుకుందామంటే ప్రతిపక్షాలు పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు గెలుస్తామని చెప్పి - నిరూపించుకున్నామని - ఇప్పుడు కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు టీఆర్ ఎస్‌ కే వస్తాయన్నారు. అన్ని స్థానాల్లో తామే విజయం సాధించాలనుకోవడం సరికాదన్నారు. ఎన్నికలన్నా... సభలన్నా టీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని, ప్రజల కోసం రాజీనామాలు చేసిన చరిత్ర మాదేనన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మరణించిన చోట కూడా టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలు గెలుపొందారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎందుకు వెళ్లామనే విషయం కూడా ప్రజలతో చర్చిస్తామని - ప్రజల సూచనతోనే నిర్ణయం తీసుకుంటామని - మాకు ప్రజలే ఫైనల్‌ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. టీఆర్ ఎస్‌ కు అధిష్టానం ప్రజలే కానీ... ఢిల్లీలోనే - నాగపూర్‌ లోనే లేరని మరోసారి స్పష్టం చేశారు. ప్రజాభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రజల ఆశీర్వాదం - పాలనపై నమ్మకం ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తారని - అంతేకానీ పొత్తులతో గెలువలేరని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. పార్టీలతో పొత్తు పెట్టుకునే అవసరం లేదన్నారు. టీడీపీ - కాంగ్రెస్‌ తో పొత్తుపై స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నైతిక విలువలను తుంగలో తొక్కే విధంగా ఉందని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. తెలంగాణలో టీడీపీ ఉనికే లేదన్నారు. ఉనికి లేని పార్టీ గురించి మాట్లాడబోనన్నారు. లేని పార్టీలతో పొత్తు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ఉనికి లేదని ఏపీ ముఖ్యమంత్రి - ఆయన తనయుడు చెప్పకనే చెప్పారన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎగిరెగిరి పడుతుందని - ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే జీహెచ్ ఎంసీలో ఐదు స్థానాలను కూడా గెల్చుకోలేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తాను అన్ని పార్టీల నేతలతో కలుస్తానని   ప్రజాస్వామ్యంలో హక్కు ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి నియోజకవర్గ నేతలు - టిక్కెట్లు ఖరారు అయిన వారు కూడా గులాబీ కండువా వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, తనతో టచ్‌లో ఉన్నారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తమ పార్టీ నేతలను కూడా ఇతర పార్టీ నేతలు రమ్మంటారని, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఈ అవకాశం ఉంటుందన్నారు. టీఆర్ ఎస్‌ లో రాజకీయ గొడవలు లేవని, కొత్తవారు వస్తే రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేరతారన్నారు.
 


Tags:    

Similar News