మోడీ సీన్ ఎంతో చెప్పిన కేటీఆర్!

Update: 2018-09-23 05:13 GMT
పెద్దా.. చిన్న అన్న తేడా లేదు. త‌న నోటి ముందు ఎవ‌రైనా స‌రే తేలిపోవాల్సిందే. తేలిగ్గా తేల్చేయాల్సిందే. తాజా మాజీ మంత్రి కేటీఆర్ మాట‌ల తీరు అలానే ఉంది. ప్ర‌ధాని మోడీ మొద‌లు.. టీటీడీపీ అధ్య‌క్షుడు ర‌మ‌ణ వ‌ర‌కూ పుల్ల‌ను తీసేసిన‌ట్లుగా తీసేయ‌టం కేటీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో!
రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ‌టం.. వారిని మాట‌ల‌తో దునుమాడ‌టం మామూలే. అయితే.. మ‌రీ ఇంత‌లా తీసి పారేయొచ్చా? అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం మాత్రం కేటీఆర్ కే చెల్లుతుందేమో?   తాజాగా పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం ఒక‌టి సిరిసిల్ల‌లో చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ నోటి నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు ఆశ్చ‌ర్య‌క‌రంగానే కాదు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ప్ర‌ధాని మోడీ మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. ఇక‌పై మోడీకి అంత సీన్ ఉండ‌ద‌ని.. ఇన్ని రోజులు గ‌డిచిన‌ట్లుగా ఇక మీద ఆయ‌న గ‌డ‌వ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. 15 మంది ఎంపీల‌ను గెల్చుకుంటే అంతా త‌మ వెంటే ఉంటార‌న్నారు. మొత్తం 552 స్థానాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన లోక్ స‌భ స్థానాలు 17 అయితే.. అందులో 15 సీట్లు త‌మ‌కు వ‌స్తే.. అంద‌రూ త‌మ వెంటే ఉంటార‌న్న కేటీఆర్ మాట‌లు చూస్తే.. బ‌డాయి మాట‌లుగా క‌నిపించ‌క మాన‌దు.

మోడీని పూచిక‌ పుల్ల‌గా తీసి పారేసిన కేటీఆర్‌.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాంన‌బీ అజాద్ ను సైతం సింఫుల్ గా తీసేశారు. కేసీఆర్ అన్న మూడు అక్షరాలు లేకుంటే 300 ఏళ్ల‌కైనా తెలంగాణ వ‌చ్చేదా? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. కేసీఆర్ ను గ‌ద్దె దించాల‌నే ల‌క్ష్యంతోనే ఉత్త‌మ్ ప‌ని తీరు ఉంద‌న్నారు. అయినా.. ఉత్త‌మ్ ఎవ‌రు?  ఆయ‌న‌కు తెలంగాణ పీసీసీ చీఫ్ ప‌ద‌వి రావ‌ట‌మే కేసీఆర్ పెట్టిన భిక్ష‌గా వ్యాఖ్యానించ‌టం చూస్తే.. కేటీఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మోడీ.. గులాం న‌బీ అజాద్‌.. ఉత్త‌మ్ ల‌ను సింఫుల్ గా తేల్చేసిన కేటీఆర్ కు.. టీటీడీపీ ర‌థ‌సార‌ధి ఎల్‌. ర‌మ‌ణ ఏం కంటికి ఆన‌తారు. అందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న్ను ఉద్దేశించిన వ్యాఖ్యలు ఉన్నాయ‌ని చెప్పాలి. ఎల్ ర‌మ‌ణ‌కు త‌న సీటే దిక్కు లేద‌ని.. ఇంకో 20 సీట్లు తెస్తాడ‌ని చెబుతున్నారంటూ ఎద్దేవా చేయ‌టం గ‌మ‌నార్హం. మొత్తానికి తాము త‌ప్పించి ఎవ‌రైనా స‌రే.. ఏమీ చేయ‌లేద‌ని.. వారికి ఆ స్థాయి లేద‌న్న‌ట్లుగా మాట్లాడుతున్న కేటీఆర్ మాట‌లు తెలంగాణ ఓట‌ర్ల మీద ఎలాంటి ప్ర‌భావాన్ని చూపుతాయో చూడాలి.


Tags:    

Similar News