కేటీఆర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతోంద‌ట‌

Update: 2018-02-07 06:35 GMT
తెలుగు రాష్ర్టాల్లో గ‌త కొద్దికాలంగా ఒక కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంటుండ‌టం గ‌మనించే ఉంటారు. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాలను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కావ‌చ్చు...లేదా కేంద్ర ప్ర‌భుత్వం కావ‌చ్చు..కాక‌పోతే కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా కావ‌చ్చు నిర్వ‌హిస్తున్నాయి. స‌హ‌జంగానే ఇలాంటి ప్ర‌తిష్టాత్మ‌క స‌ద‌స్సుల‌కు - స‌మావేశాల‌కు వేదిక అవ‌డం వ‌ల్ల ఆ రాష్ట్రం గురించి మ‌రోమారు ప‌లువురు చ‌ర్చించుకునే అవ‌కాశం ద‌క్కుతుంది. ఇదే స‌మ‌యంలో రెండు రాష్ర్టాల పాల‌కులు త‌మ య‌థాశ‌క్తి త‌మ‌కు తాముగా...త‌మ వార‌సుల‌ను సైతం ప్రొజెక్టే చేసేందుకు ప్రయ‌త్నం చేస్తూనే ఉన్నారు.

ఇలాంటి `స‌న్ షైన్‌` కార్య‌క్ర‌మాల‌ను త‌మ‌దైన శైలిలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు - తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌త్య‌క్షంగా మ‌రికొన్ని ఉదంతాల్లో ప‌రోక్షంగా చేస్తున్న సంగ‌తిని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌ లో త‌న స‌హ‌జ శ‌క్తిసామ‌ర్థ్యాలు - నైపుణ్యంతో ఏపీ మంత్రి నారా లోకేష్ కంటే...తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందున్నార‌నేది అనేకమంది మాట‌. అలాంటి పొరుగు రాష్ట్ర  సీఎం త‌న‌యుడి కంటే ముందున్న మంత్రి కేటీఆర్ గ్రాఫ్ ఈ నెల‌లో పెద్ద ఎత్తున పెర‌గ‌నుంద‌ని...ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు. ఇందుకు కార‌ణంగా ఫిబ్ర‌వ‌రీ నెల‌లో జ‌ర‌గ‌నున్న ప‌లు స‌ద‌స్సుల‌ను ప్ర‌స్తావిస్తున్నారు.

ఈ ఒక్క నెలలోనే మూడు అంతర్జాతీయ సదస్సులకు రాజధాని హైద‌రాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రతిష్ఠాత్మక మైనింగ్ టుడే సదస్సు - వరల్డ్ ఐటీ కాంగ్రెస్ - బయో ఏషియా సదస్సులకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ మూడు సదస్సుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి కానుంది. ఈ మూడు సదస్సులు రాష్ట్ర ఐటీ - పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ సారథ్యంలోని శాఖ‌ల‌వే కావ‌డం ఇక్క‌డ అస‌లు విష‌యం. అందుకే ఈ సంతోషాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకొన్నారు. హ్యాపెనింగ్ హైదరాబాద్ అంటూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఈ నెల 14 నుంచి 16 వరకు మైనింగ్‌టుడే సదస్సును నిర్వహిస్తున్నారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌ తోపాటుగా నాస్కాం ప్రతిష్ఠాత్మక సదస్సు అయిన ఇండియా లీడర్‌ షిప్ ఫోరం సదస్సు ఈనెల 19 నుంచి 22 వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు బయో ఏషియా సదస్సు హైదరాబాద్‌ లో జరుగుతుంది. మైనింగ్ టుడే సదస్సుకు ఇటలీ - చైనా - దక్షిణాఫ్రికా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. 19 నుంచి జరిగే వరల్డ్ ఐటీ కాంగ్రెస్ - నాస్కాం ఇండియా లీడర్‌ షిప్ ఫోరం సదస్సులో ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. దాదాపు 30 దేశాల నుంచి రెండువేల మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సులో 150 మంది ప్రపంచ ప్రభావశీలురైన ప్రముఖులు.. మొత్తం 50 సెషన్స్‌ లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో 50 పైగా సాంకేతిక ప్రదర్శనలు జరుగనున్నాయి. 22 నుంచి జరిగే బయో ఏషియా సదస్సులో 50 దేశాల నుంచి 800 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ మూడు సదస్సులకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమివ్వడమే కాకుండా భాగస్వామ్యం పంచుకుంటోంది.

స‌హ‌జంగానే ఈ కార్య‌క్ర‌మాల ద్వారా కేటీఆర్ త‌న మార్కును చాటుకోవ‌డం ఉంటుంది. అందుకే ఆయ‌న అనుచ‌రులు, స‌న్నిహితులు...త‌మ నాయ‌కుడి గ్రాఫ్ మ‌రింత పెరుగుతుంద‌ని ఖుష్ అవుతున్నారు.

Tags:    

Similar News