కేటీఆర్ పోరాటంతోనే ఈమాత్రం సాధ్యమైందా?

Update: 2017-08-07 23:30 GMT
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర జీఎస్టీ మండలి సమావేశం జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా అనేక దఫాలుగా సమావేశాలు జరిగాయి. రాష్ట్రాలనుంచి ప్రతినిధులను పిలిపించి.. అభిప్రాయాలు అభ్యంతరాలు తెలుసుకున్నారు. అయితే గతంలో తెలంగాణ నుంచి ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈసారి మాత్రం ప్రత్యేకంగా.. కల్వకుంట్ల తారక రామారావు.. ఢిల్లీ వెళ్లారు. జీఎస్టీ చర్చల్లో ప్రభుత్వ అభ్యంతరాలనూ చెప్పారు. కొన్ని విషయాలు సాధించారు. అయితే ప్రాజెక్టులపై జీఎస్టీ గురించి కేసీఆర్ ఆగ్రహిస్తుండవచ్చు గానీ.. నిజానికి విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి.. కేటీఆర్ చేసిన కృషి వల్లనే ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా చాలా మేలు జరగబోతోంది.

జీఎస్టీని అమలు చేసే విషయంలో కేంద్రం చాలా మొండిగానే ఉంది. రాష్ట్రాలనుంచి కొత్తగా మినహాయింపుల గురించి ఎలాంటి వినతులు వస్తున్నా సరే ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఆ క్రమంలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ప్రాజెక్టులు - సంక్షేమ పథకాల నిర్మాణాల మీద కూడా 18 శాతం జీఎస్టీనే విధించారు. ఈ విషయంపై కేటీఆర్ తీవ్రమైన అభ్యంతరాల్ని వెలిబుచ్చారు.

ప్రభుత్వం పేదల కోసం సంక్షేమపథకాలు చేపడుతోంది - అన్నదాతల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తోంటే ఏదో లాభాపేక్షతో చేసే వ్యాపారాల  మీద విధించినట్లుగా అంత భారీ మొత్తంలో పన్నులు విధించడానికి వీల్లేదంటూ ఆయన వాదించారు. నిజానికి ఈ నిర్మాణాల మీద పన్నులు ఉండడానికి వీల్లేదని, విధించినా సరే.. 5 శాతానికి మించడానికి వీల్లేదని కేటీఆర్ కోరారు.

దీనిపై చర్చోపచర్చలు తర్జన భర్జనలు జరిగిన తర్వాత.. జీఎస్టీ మండలి ఆ పన్నును మాత్రం 12 శాతానికి తగ్గించడానికి అంగీకరించింది. ఒక రకంగా చెప్పాలంటే.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఆర్థికంగా ఎంతో మేలు చేసే వెసులుబాటు ఇది. రాష్ట్రాల స్థితిగతులను కేటీఆర్ సమర్థంగా మండలి సమావేశంలో చెప్పడం వల్లనే ఇది సాధ్యమైందని అంతా అంటున్నారు. కనీసం జరగబోయే ప్రాజెక్టుల వరకైనా.. పన్ను భారం తగ్గే వెసులు బాటు వచ్చిందని చెప్పుకుంటున్నారు. కాకపోతే.. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై విషయంలో కేసీఆర్ ఆగ్రహించడం వలన కేటీఆర్ కృషి వెలుగులోకి రాకుండాపోయిందని అంతా అనుకుంటున్నారు. కనీసం ఆ పాటి వరకైనా కేంద్రంతో వాదించి.. అన్ని రాష్ట్రాలకు లాభం జరిగేలా చూడడం గొప్ప విషయమే అని పలువురు ప్రశంసిస్తున్నారు.
Tags:    

Similar News