కేటీఆర్ వినూత్న ప్ర‌తిపాద‌న‌.. ప్ర‌తియేటా లాక్‌డౌన్

Update: 2020-04-11 03:30 GMT
ప్ర‌స్తుతం క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌పంచ దేశాల‌తో పాటు భార‌త‌దేశంలోనూ లాక్‌డౌన్ విధించారు. 24 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్ ప్ర‌స్తుతం ముగియ‌నుంది. అయితే క‌రోనా కేసులు పెరుగుతూనే ఉండ‌డంతో లాక్‌డౌన్ మ‌రికొన్నాళ్ల పాటు కొన‌సాగించాల‌నే డిమాండ్ మొద‌ట తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు చేశారు. ఆ త‌ర్వాత అదే ప్ర‌తిపాద‌న‌ను దేశంలోని ప‌లు రాష్ట్రాల్లు చేస్తునే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ మే 1వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ఈ స‌మ‌యంలోనే లాక్‌డౌన్ విష‌య‌మై తెలంగాణ మంత్రి కె. తార‌క రామారావు వినూత్న ప్ర‌తిపాద‌న చేశారు. ప్ర‌స్తుతం విధించిన లాక్‌డౌన్‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు స‌మకూరాయాని, ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌తి యేటా విధిస్తే దేశానికి, ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో మంచిద‌ని తెలిపారు.

ప్ర‌పంచ‌మంతా అంగీక‌రిస్తే ప‌దేళ్ల పాటు ఈ విధంగా ప్ర‌తి సంవ‌త్స‌రం లాక్‌డౌన్ విధించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల క‌ళ్లు తెరిపించింద‌ని.. భ‌విష్య‌త్‌లో అన్ని దేశాలు వైద్యారోగ్యానికి ప్రాధాన్య‌మిస్తాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడ‌గింపు విష‌య‌మై అన్ని వ‌ర్గాల‌తో సంప్ర‌దింపులు చేసి తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని వివ‌రించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ట్విట‌ర్‌లో కొద్దిసేపు లైవ్‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు పై విధంగా స‌మాధానం చెప్పారు.

అయితే మంత్రి కేటీఆర్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను అంద‌రూ స్వాగ‌తిస్తున్నారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో పేద‌లు, కూలీలు మిన‌హా మిగ‌తా వారంద‌రూ హ‌ర్షించార‌ని చెబుతున్నారు. లాక్‌డౌన్‌తో స్వీయ నిర్బంధంలో ప్ర‌జ‌లు ఉండ‌డంతో వారి కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య ప్రేమానురాగాలు పెరిగాయ‌ని, వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోవ‌డంతో వాతావ‌ర‌ణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుని ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేశాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. భూతాపం త‌గ్గిపోయి.. ప్ర‌స్తుతం ఎండాకాలం ఉన్నా అంత‌గా ఉష్ణోగ్ర‌తలు పెర‌గ‌లేద‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు గుర్తుచేస్తున్నారు. కేటీఆర్ ప్ర‌తిపాదించిన‌ట్టు ప్ర‌తియేటా లాక్‌డౌన్ విధిస్తే దేశానికి.. ప‌ర్యావ‌ర‌ణానికి.. ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగమ‌ని పేర్కొంటున్నారు. ఈ మేర‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు.


Tags:    

Similar News