తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు.. 'షా'ను కడిగేసిన కేటీఆర్

Update: 2022-05-14 04:28 GMT
కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తోంది తెలంగాణ రాష్ట్రం. సాధారణంగా తమను టార్గెట్ చేసిన రాష్ట్రంపై తమ మార్కును ప్రదర్శించే కమలనాథుల తీరుకు భిన్నంగా తెలంగాణ విషయంలో వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నారు మోడీషాలు. గడిచిన కొద్దికాలంగా కేంద్రంలోని మోడీ సర్కారుపై నిప్పులు చెరుగుతోంది కేసీఆర్ ప్రభుత్వం. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా తెలంగాణకు జరిగిన అన్యాయంపై అదే పనిగా గళం విప్పుతున్న గులాబీ నేతల్లో మంత్రి కేటీఆర్ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ రోజు (శనివారం) భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిధిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ తనకు అలవాటైన రీతిలో.. తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారంటూ గద్దింపు స్వరంతో ప్రశ్నిస్తున్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు వస్తున్న అమిత్ షాను ఉద్దేశించి ఆయనో లేఖ రాశారు.

తెలంగాణపై బీజేపీ కక్ష కట్టిందని.. ఎనిమిదేళ్లుగా అంతులేని వివక్షతో రాష్ట్రం కడుపు కొడుతుందన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించటం ఆ పార్టీకే చెల్లిందన్నారు. రాష్ట్రానికి అలా వచ్చి.. ప్రసంగాలు దంచటం.. విషం చిమ్మటం.. మళ్లీ పత్తా లేకుండా పోవటం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా ఇచ్చిన హామీల్ని కూడా నెరవేర్చని బీజేపీ.. గుజరాత్ మీద వల్లమాలిన ప్రేమతో ఇవ్వని హామీలను సైతం ఆగమేఘాల మీద అమలు చేయటం దేనికి సంకేతం? అంటూ ప్రశ్నించారు.

అంతేకాదు.. తెలంగాణ మీద సవతితల్లి ప్రేమను ఇలానే కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. హైదరాబాద్ నగర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరదల్లో మునిగితే.. గుజరాత్ కు వేలాది కోట్లు సాయంగా అందించి.. తెలంగాణకు నయా పైసా ఇవ్వకుండా.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణఖు వస్తున్నారు? ఇది సిగ్గు చేటు కాదా? అంటూ కడిగిపారేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ విషయంలో కేంద్రం ఏమేం హామీల్ని నెరవేర్చకుండా చేసిందన్న దానిపై పలు ప్రశ్నల్ని సంధించారు. అవేటన్నది చూస్తే..

-  విభజన చట్టంలో చెప్పిన ఏ ఒక్క హామీనైనా మీ ప్రభుత్వం నెరవేర్చిందా?

-  కాజీపేట రైల్వే కోచ్ కర్మాగారం హామీ కాదని ఇటీవల రూ.20 వేల కోట్లతో గుజరాత్ లో కోచ్ ల కర్మాగారం పెట్టాలని నిర్ణయించటం మా మీద చిన్నచూపునకు నిదర్శనం కాదా?

-  రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాలను మంజూరు చేయలేదు

-  బయ్యారం ఉక్కు హామీ తప్పు పట్టటం వాస్తవం కాదా?

-  ఐటీ రంగంలో హైదరాబాద్ డెవలప్ మెంట్ ను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో మీ పార్టీ.. ప్రభుత్వ కుట్రలకు ఐటీఐఆర్ రద్దు పరాకాష్ఠ కాదా?

-  తెలంగాణకు సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కు ఎందుకు ఇవ్వట్లేదు?

-  పాలమూరు- రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా హామీని ఎందుకు అమలు చేయటం లేదు?

-  స్కైవేల కోసం రక్షణ శాఖ భూములు అడిగితే ఏడేళ్లుగా తొక్కి పడుతూ నగర పౌరులను అవస్థలకు గురి చేస్తున్నారు.

-   ఫార్మా హబ్ కు సాయం లేదు. వరంగల్ కాకతీయ జౌళిపార్కుపై శీతకన్ను వేసి.. సిరిసిల్ల మెగా పవర్ లూం సమూహానికి మొండి చేయి చూపారు.

-  ప్రజల నడ్డి విరిచేలా పెంచుతున్న పెట్రో ధరలకు అసలు కారణమైన సెస్సులను రద్దు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగితే ఎందుకు స్పందించలేదు?

-  సంప్రదాయ వైద్య కేంద్రం హైదరాబాద్ కు వస్తుందని మీ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కానీ దాన్ని గుజరాత్ కు తరలించుకు వెళ్లారు.

-  హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ కు ఒక్క పైసా ఇవ్వకుండా పోటీగా గుజరాత్ లో మరో కేంద్రం పెట్టటం సరైన పనేనా?
Tags:    

Similar News