అద్దాల్లో బొమ్మ: ఇదో అమ్మ ప్రేమ‌క‌థ‌!

Update: 2016-09-26 04:32 GMT
అదో క్లాత్ షోరూమ్‌.. మెక్సికోలో  ఉంది. దాని పేరు లా పాపుల‌ర్‌. పేరుకు త‌గ్గ‌ట్టుగానే ఆ దుకాణం చిహుహా న‌గ‌రంలో చాలా పాపుల‌ర్. అయితే, ఆ దుకాణంలో ఉన్న దుస్తుల వ‌ల్ల దానికి అంత పాపులారిటీ రాలేదు, షాప్ ముందున్న ఒకే ఒక బొమ్మ వ‌ల్ల అంత పేరు వ‌చ్చేసింది! దుకాణం ముందు అంద‌మైన దుస్తులు ధ‌రించిన ఒక బొమ్మ ఉంటుంది. స‌జీవ శిల్పం అంటుంటాం క‌దా, స‌రిగ్గా అదే రేంజిలో జీవ‌క‌ళ తొణిక‌స‌లాడుతూ దుకాణానికి వ‌చ్చేవారిని ప‌ల‌క‌రిస్తోందా అన్న‌ట్టుగా చిరున‌వ్వులు చిందిస్తూ ఉంటుంది. ఆ బొమ్మ‌కో పేరుందండోయ్‌... లా పాస్కౌలిత‌. దుకాణానికి వ‌చ్చిన వారంద‌రూ ముందుగా ఆ బొమ్మ‌ను చూస్తూ... ఆ అందానికి ముగ్దులైపోతూ కాసేపు నిల‌బ‌డిపోతారు. ఇంత‌కీ, అది బొమ్మా... క‌ద‌ల‌కుండా నిల‌బ‌డ్డ మ‌నిషా అనే అనుమానం కొంత‌మందికి క‌లుగుతుంది. దాన్ని నివృత్తి చేసుకునేందుకు ఆ షాపువారిని ఇదే ప్ర‌శ్న అడిగితే వారు ఏం చెబుతారో తెలుసా. అది బొమ్మా కాదూ మ‌నిషీ కాదు... అదో మృత‌దేహం అని చెబుతారు!

నిజం, లా పాస్కౌలిత ఒక బొమ్మ కాదు... ఒక అమ్మ‌కు కూతురు! ఆమె మ‌ర‌ణించి దాదాపు 75 సంవ‌త్స‌రాలు కావొస్తోంది. అప్ప‌టి నుంచీ ఇప్ప‌టివ‌ర‌కూ ఆమె శ‌వం ఇదిగో... ఇలా అందంగా ముస్తాబై దుకాణంలోనే ఉంటోంది. బొమ్మ‌రూపంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ అప్ప‌ట్లో అమ్మ కూచి. ఆ త‌ల్లికి కూడా బిడ్డ అంటే చాలా ప్రాణం. ఆమె ఏం అడిగినా కాద‌న‌కుండా తెచ్చిపెట్టేది. త‌న బిడ్డ‌కు ఓ మంచి సంబంధం కూడా చూసింది. స‌రిగ్గా పెళ్లి రోజున‌... కాసేప‌ట్లో క‌ల్యాణం అన‌గానే అందంగా ముస్తాబైంది. హ‌ఠాత్తుగా ఆమెకి తేలు కుట్టింది. దాంతో ఆమె మ‌ర‌ణించింది. అయితే, మ‌ర‌ణించిన త‌న బిడ్డ‌ను తాను ఎప్పుడూ క‌ళ్ల‌ముందే చూస్తూ ఉండాల‌న్న‌ది స‌ద‌రు త‌ల్లి కోరిక‌. దీంతో ఆమెని ఇదిగో ఇలా అందంగా అలంక‌రించి గాజు అద్దాల మ‌ధ్య దుకాణంలో భ‌ద్ర‌ప‌ర‌చారు. 1930, మార్చి 25 నుంచి దుకాణంలో బొమ్మ‌గా మారిపోయింది లా పాస్కౌలిత మృత‌దేహం! అప్ప‌ట్నుంచీ అలానే దుకాణంలోనే ఈ బొమ్మ ఉండిపోయింది.

ఈ శ‌వానికి, సారీ.. బొమ్మ‌కు అతీంద్రియ శ‌క్తులు ఉన్నాయ‌నీ, భ‌య‌పెడుతూ ఉంటుంద‌నీ, ఒక్కోసారి అటు చూస్తూ ఉంటుంద‌నీ ఇటు చూస్తూ ఉంటుంద‌ని చాలా క‌థ‌లు వినిపిస్తూ ఉంటాయి. దుకాణంలో ప‌నిచేస్తున్న‌వారు కూడా ఒక్కోసారి బొమ్మ‌ని చూసి భ‌య‌ప‌డిపోతూ ఉంటారు. ఈ షాపులో ప‌నిచేసే సోనియా బ‌ర్షియా అనే ఉద్యోగికి అంద‌రికంటే ఎక్కువ టార్చ‌ర్‌! ఎందుకంటే, ఆ మృత‌దేహాన్ని జాగ్ర‌త్త చూసుకోవాల్సింది బాధ్య‌త ఈమెదే. ప్ర‌తీ 15 రోజుల‌కు ఒక‌సారి ఈ మృత‌దేహాన్ని ఒక గ‌దిలోకి తీసుకెళ్లి డ్రెస్ మార్చుతూ ఉంటుంది. మ‌మ్మీని భ‌ద్ర‌ప‌ర‌చిన విధంగా లా పాస్కౌలిత‌ను భ‌ద్రంగా చూసుకుంటున్నారు. అంతేకాదు, ఏడాదికి ఒక‌సారి ఆమెను స్మ‌రిస్తూ పూజ‌లు కూడా చేసి పువ్వులు పెడుతూ ఉంటారు.
Tags:    

Similar News