మునుగోడు ఎల‌క్ష‌న్‌.. కూలీల‌కు డిమాండ్.. నిజ‌మే గురూ!

Update: 2022-10-29 23:30 GMT
మ‌రో మూడు రోజుల్లో మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. ఇక‌, నాయ‌కులు త‌ట్టాబుట్టా స‌ర్దుకోవ‌డ‌మే. ఈ మూడు రోజుల్లోనే ఏం చేయాల‌న్నా.. చేసేయాలి..ఏం చెప్పాల‌న్నా చెప్పేయాలి. ఈ 'మూడు'  దాటితే ఏం చేసినా ప్ర‌యోజ‌నం లేదు. అందుకే కీల‌క‌పార్టీలైన బీజేపీ, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ ముమ్మ‌ర ప్ర‌చారానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇక‌, ఇల్లు ఇల్లు వీధివీధి తిరిగి మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించాల‌ని నిర్ణ‌యించాయి. అయితే.. ఇక్క‌డ వారికి కార్య‌క‌ర్త‌లు క‌రువ‌య్యారు. దీంతో కార్య‌క‌ర్త‌ల‌ను అప్ప‌టిక‌ప్పుడు కొనేందుకు కూడా పార్టీలు రెడీ అయ్యాయి.

అదేంటి అనుకుంటున్నారా.. రోజువారీ ప‌నుల కోసం వెళ్లేవారిని డ‌బుల్ కూలీ ఇచ్చి త‌మ కార్య‌క‌ర్త‌లుగా జెండాలు ప‌ట్టిస్తున్నారు నాయకులు. అయితే.. ఇప్పుడు వీరు కూడా దొర‌క‌డం లేద‌ట‌. దీంతో ఏం చేయాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నారు.

అంత డిమాండ్‌గా ఉంది కూలీల ప‌రిస్థితి! దీంతో ప్ర‌చారానికి వెళ్తున్న‌వారు వెళ్తూనే.. ఇతర ప్రాంతాల్లోని త‌మ బంధుమిత్రులను కూడా కూలీలు పిలుస్తున్నారు. పోలింగ్ చేరువవుతుండటంతో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఒకరోజు ప్రచారానికి వెళ్తే, రెండు పూటలూ భోజనం పెట్టి, రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు.

పొద్దస్తమానం పనిచేస్తే వచ్చే కూలి డబ్బులకు రెట్టింపు నాలుగైదు గంటల్లోనే సంపాదించుకోవచ్చు.. అక్కడెక్కడో కష్టపడే బదులు మా ఊరికి రండి.. మా ఇంట్లోనే ఉండొచ్చు. మమ్మల్ని చూసినట్లూ ఉంటుంది.. ప్రచారానికి వెళ్లి నాలుగు పైసలు వెనకేసుకోవచ్చు.. అంటూ మునుగోడు నియోజకవర్గ వాసులు ఇతర ప్రాంతాల్లోని బంధుమిత్రులను పిలుస్తున్నారు.

అయితే, పార్టీలకు సంబంధం లేని వారినే పిలుస్తున్నారు. ఒకరోజు ప్రచారానికి వెళ్తే, రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. రెండు పూటలా భోజనం పెడుతున్నారు. అభ్యర్థులు, ముఖ్య నాయకులు వచ్చినప్పుడు బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికే వారికి అదనంగా రూ.500-1000 చెల్లిస్తున్నారు.

ఒక్కోరోజు గ్రామంలో రెండు లేదా మూడు పార్టీల ప్రధాన నేతల ప్రచారం ఉంటోంది. ఈ సమయంలో ప్రచారానికి జనాన్ని తరలించడం సమస్యగా మారింది. స్థానిక నేతలు సైతం తెలిసిన వారిని, బంధుమిత్రులను పిలవమని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లు ఇతర ప్రాంతాల్లోని బంధువులను ఆహ్వానిస్తున్నారు. ఎక్కువగా మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తానికి స్తానికంగా సంక్రాంతి అప్పుడే వ‌చ్చిందా అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News