ఆ లేడీ సూప‌ర్ స్టార్ అంతేనా?

Update: 2021-12-29 02:30 GMT
ఆమె సినిమాల్లో లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.. హీరోల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. లేడి అమితాబ్‌బ‌చ్చ‌న్‌గానూ కీర్తి గ‌డించారు. కానీ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో మాత్రం ఆ దూకుడు కొన‌సాగించ‌డం లేదు. ఆమె పొలిటిక‌ల్ సూప‌ర్ స్టార్ అనిపించుకోవ‌డం లేదు. ఇంత‌కీ ఆమె ఎవ‌రూ అంటారు.. త‌ను విజ‌య శాంతి. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఆమె ఆ పార్టీతో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆమె యాక్టివ్‌గా హాజ‌రు కాలేక‌పోవ‌డంతో రాష్ట్ర నాయ‌క‌త్వం ఆమెను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల‌కు ఆహ్వానాలు పంపినా ఆమె హాజ‌రు కాక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణంగా తెలుస్తోంది.

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన నిరుద్యోగ దీక్ష‌లో ఆమె మెరిశారు. కానీ అంత‌కుముందు పార్టీ నిర్వ‌హించిన వివిధ కార్య‌క్ర‌మాల్లో ఆమె ఎక్క‌డా క‌నిపించ‌లేద‌ని టాక్‌. దీంతో ఆమె ఏ పార్టీలో ఉన్నా ఇంతే అనే మాట‌లు వినిపిస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కూ కాంగ్రెస్‌లో ఉన్న విజ‌య శాంతి ఆ స‌మ‌యంలోనూ గాంధీభ‌వ‌న్‌కు చాలా అరుదుగా వ‌చ్చేవాళ్ల‌ని తెలిసింది.

ఆ పార్టీలో ఆమెకు ప్ర‌ధాన బాధ్య‌త‌లు అప్ప‌జెప్పినా పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని అంటున్నారు. సోనియా గాంధీ స‌మ‌క్షంలో పార్టీలో చేర‌డంతో రాష్ట్ర నేత‌ల‌ను ఆమె లెక్క చేయ‌లేద‌ని అప్పుడు పార్టీ శ్రేణులే మాట్లాడుకున్నాయి. ఇప్పుడు తిరిగి బీజేపీలో చేరిన త‌ర్వాత కూడా ఆమె త‌న పంథాను మార్చుకోలేద‌ని తెలుస్తోంది.

బీజేపీలో చేరిన మొద‌ట్లో ఈ రాముల‌మ్మ యాక్టివ్‌గానే క‌నిపించారు. నాగార్జున సాగ‌ర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున ప్ర‌చారం కూడా చేశారు. కానీ కొన్నిసార్లు మాత్రం దూరంగా ఉంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆహ్వానిస్తే త‌ప్ప ఆమె కార్య‌క్ర‌మాల‌కు రావ‌డం లేద‌ని స‌మాచారం. రాష్ట్ర పార్టీ ఇంఛార్జీ త‌రుణ్ చుగ్ వ‌స్తేనే ఆమె పార్టీ కార్యాల‌యానికి వ‌స్తున్నార‌ని టాక్‌. దీంతో ఆమె ఎలాగో రాద‌ని మిగిలిని నేత‌లు ఆహ్వానాలు పంప‌డం కూడా మానేశార‌ని తెలిసింది.

విజ‌యశాంతి మొదటి నుంచి త‌న‌కో ప్ర‌త్యేక గుర్తింపు ఉండాల‌ని కోరుకుంటారు. త‌న‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌ని చోట ఆమె ఉండ‌లేరు. అందుకే ఇన్ని పార్టీలు మారార‌ని అంటున్నారు. మొద‌ట్లో బీజేపీలో చేరిన ఆమె.. ఆ త‌ర్వాత 2005లో త‌ల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. దాన్ని 2009లో టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఆ ఎన్నిక‌ల్లో మెద‌క్ నుంచి ఎంపీగా గెలిచారు.

పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆమెను 2013లో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో 2014లో రాముల‌మ్మ కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఏడాది ఎన్నిక‌ల్లో మెద‌క్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. 2020 చివ‌ర్లో బీజేపీలో చేరారు.


Tags:    

Similar News