ల‌గ‌డ‌పాటికి భార్య ఎలా షాకిచ్చిందో తెలుసా?

Update: 2018-12-06 05:05 GMT
ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ త‌న స‌ర్వేతో తెలంగాణ‌లో కాక పుట్టించారు. కాంగ్రెస్ నేతృత్వం లోని ప్ర‌జా కూట‌మికే విజ‌యావ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని తేల్చి చెప్పారు. ఆయ‌న స‌ర్వేను గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ - కేటీఆర్ తోసి పుచ్చారు. బూట‌క‌పు స‌ర్వేలు న‌మ్మొద్దంటూ తెలంగాణ ప్ర‌జానీకానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. త‌న‌తో ల‌గ‌డ‌పాటి వాట్సాప్ చాట్ వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డం ద్వారా ఆయ‌న గాలి తీసేశారు కేటీఆర్.

ల‌గ‌డ‌పాటి స‌ర్వేల‌ను ఎవ‌రు ఎంత‌గా విశ్వ‌సిస్తున్నారో తెలియ‌దుగానీ.. స్వ‌యంగా ల‌గ‌డ‌పాటి స‌తీమ‌ణి ప‌ద్మ‌కు మాత్రం త‌న భ‌ర్త స‌ర్వేల‌ పై బొత్త‌గా న‌మ్మ‌కం లేద‌ని తాజాగా స్ప‌ష్ట‌మైంది. త‌న భ‌ర్త స‌ర్వేలు బూట‌క‌మ‌న్న రీతిలో ఆమె మాట్లాడ‌టం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే.. ఖైర‌తాబాద్‌ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గా దానం నాగేంద‌ర్ బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. భ‌ర్త విజ‌యం కోసం నాగేంద‌ర్ భార్య అనిత కొన్ని రోజులుగా నియోజ‌క‌ వ‌ర్గ‌మంతా క‌లియ‌తిరుగుతూ ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా ఆమెకు ల‌గ‌డ‌పాటి స‌తీమ‌ణి ప‌ద్మ కూడా జ‌త క‌లిశారు. బుధ‌వారం దానం నాగేంద‌ర్ త‌ర‌ఫున ప‌ద్మ ఖైర‌తాబాద్‌ లో ప్ర‌చారం చేశారు. దానంకే ఓటెయ్యాలంటూ ప్ర‌జ‌ల‌ను కోరారు.

ప్ర‌చారం సంద‌ర్భంగా ప‌ద్మ విలేక‌ర్ల‌ తో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్ర‌స్తుతం సగంలో ఉన్నాయని అన్నారు. ఆ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వస్తే ప‌నుల‌న్నీ పూర్తవుతాయని అభిప్రాయ‌ప‌డ్డారు. లగడపాటి రాజగోపాల్ చెప్తున్నట్లుగా టీఆర్ఎస్ పట్ల తెలంగాణ‌లో ఏమాత్రం వ్యతిరేకత లేదని ప‌ద్మ చెప్పారు. టీఆర్ఎస్‌ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నేతల భార్యలే వారి మాటలు నమ్మడం లేదంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా స‌త్య‌మ‌ని ప‌ద్మ ఉదంతం తెలియ‌జేస్తోంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ దామోదర్ రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి ఇటీవ‌ల కాంగ్రెస్‌కు రాజీనామాచేసి బీజేపీలో చేరడం.. మళ్లీ సాయంత్రానికే తిరిగి కాంగ్రెస్‌లో చేరడం క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ల‌గ‌డ‌పాటి గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్నారు.
Tags:    

Similar News