అన్ని ఆశ్చర్యాలే; లఖ్వీ.. వికారుద్దీన్‌.. అసదుద్దీన్‌ ఓవైసీ

Update: 2015-04-11 13:30 GMT
నిజమే.. మామూలుగా చూస్తే సంబంధం లేని వ్యక్తుల్ని ఒక వరుసలో ఉంచినట్లు కనిపిస్తుంది. కానీ.. జాతి విశాల దృక్ఫధంతో.. నిజాన్ని నిజంగా చూసినప్పుడు వీరి పేర్లను వరుసగా రాయాల్సిన పరిస్థితిని కాదనలేం.

ముంబయి పేలుళ్ల సూత్రధారి జాకీర్‌ రెహమాన్‌ లఖ్వీ విడుదలపై భారత్‌తో సహా.. ఇజ్రాయిల్‌ లాంటి పలు దేశాలు ఆశ్చర్యాన్ని ఆందోళనను వ్యక్తం చేశాయి. నిజమే.. వారి భయాలకు కారణం లేకపోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాది స్థాయికి ఏ మాత్రం తగ్గని ఆయన్ను సుదీర్ఘ జైలు తర్వాత పాక్‌ కోర్టు ఆయన్ను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అంతర్జాతీయ సమాజం విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తుంది. లఖ్వీ ఒక అంతర్జాతీయ ఉగ్రవాది అని.. అలాంటి వారు ప్రపంచానికి ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తున్న వారికి కొదవ లేదు.

ఇక్కడ లఖ్వీ గురించి ఒక విషయాన్ని చెప్పాలి. లఖ్వీ మీద ఉన్న ఆరోపణలకు సంబంధించి భారత్‌లో ఉన్న కేసులో ఇప్పటివరకూ తీర్పు రాలేదు. అంటే.. ఆయనపై ఉన్న ఆరోపణలన్నీ ఆరోపణలుగా మాత్రమే చూడాలి. ఆయన్ను దోషి అనటానికి వీల్లేదు. ఆ మాటకు వస్తే అంతర్జాతీయ ఉగ్రవాది అనటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. ఆయనపై ఆరోపించిన ఆరోపణలేమీ ఇప్పటివరకూ నిరూపితం కాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇక కాసేపు లఖ్వీ ఎపిసోడ్‌ని వదిలేద్దాం. ఇప్పుడు వికారుద్దీన్‌ విషయానికి వద్దాం. అతగాడికి పోలీసులు అంటే ఎంత కోపమో హైదరాబాద్‌లో ఉన్న ప్రతిఒక్కరికి తెలుసు. అతను ఎంత ప్రమాదకారి అన్న విషయం అతను జైలులో ఉన్నప్పుడు కాపలా కాసిన సెంట్రీ నుంచి ఉన్నతాధికారి వరకూ అందరికి తెలుసు. అన్నింటికి మించి పేరుకు పోలీసులమనే కానీ.. అలాంటి ఆలోచన లేకుండా వికారుద్దీన్‌ బెదిరింపులు ఏ స్థాయిలో ఉంటాయో..? పోలీసులు ఏ స్థాయిలో మాటలు అంటారు చాలామంది పోలీసులకు తెలుసు.

అలాంటి వికారుద్దీన్‌ మీద కూడా ఇప్పటివరకూ కేసు తేల్లేదు. సాంకేతికంగా చూస్తే.. ఆయనపై ఉన్నవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. ఇక.. వికారుద్దీన్‌ లాంటి జాతిరత్నాన్ని కన్న తండ్రి మాటల్లో చెప్పాలంటే.. అతగాడు నిర్దోషిగా బయటకు రావటానికి అట్టే సమయం పట్టేది కాదని మీడియాతో ఓపెన్‌గా చెప్పేస్తారు. వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ సందర్భంగా కేసు 80శాతం పూర్తి అయ్యిందని.. అతను నిర్దోషిగా విడుదల అయ్యేవారన్న ధీమాను వ్యక్తం చేశారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. పాక్‌ కోర్టు విడుదల చేసిన లఖ్వీకి.. వరంగల్‌ జిల్లా జైల్లో ఉన్న వికారుద్దీన్‌లకు సంబంధించి సాంకేతికంగా వారు జైల్లో ఉన్న ముద్దాయిలు మాత్రమే. వారు దోషులు మాత్రం కాదన్నది ఒప్పుకోవాలి. అలాంటప్పుడు వికారుద్దీన్‌ను సమర్థించే మజ్లిస్‌ నేతలు లఖ్వీ విడుదలను కూడా సమర్థించాలి. లఖ్వీ విడుదలపై మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ఓవైసీ స్పందన కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎందుకంటే.. వికారుద్దీన్‌ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసుల్ని తప్పు పట్టటమే కాదు.. ఆయన ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని ఇదే అసదుద్దీన్‌ ఓవైసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని వెళ్లి కలిశారు. ఆయన వెంట పలువురు మత పెద్దలు కూడా వెళ్లారు. ఉగ్రవాది ఆరోపణలు ఉన్న వికారుద్దీన్‌ విషయంలో చూపించినంత చొరవ.. ఎస్‌ఐ సిద్ధయ్య మరణించిన విషయంలో మత పెద్దలు తమ బాధను.. ఆవేదనన ఎందుకు వ్యక్తం చేయలేదు?

సిద్ధయ్య (ముస్లిం ఆచారాల ప్రకారం ఖననం చేయబడిన పోలీసులు అధికారి. జానకీపురం వద్ద జరిగిన సిమి ఉగ్రవాదుల దాడిలో గాయపడి.. తర్వాత ఆసుపత్రిలో మరణించారు) మరణంపై ఇదే మతపెద్దలు.. అసద్‌ వెళ్లి.. ఎస్‌ఐ మరణానికి కారకులైన సంఘ విద్రోహక శక్తులపై పోరాటం చేయాలని.. వారిని చట్టబద్ధంగా శిక్షించాలని ఎందుకు కోరలేదు?

ఉగ్రవాది వికారుద్దీన్‌ అంతిమ సంస్కారానికి అసద్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బలాల హాజరయ్యారు. ఈ సందర్భంగా శవయాత్రకు కాపాలాగా వచ్చిన పోలీసు అధికారులను పెద్దఎత్తున తిట్టిపోయటం.. పెద్దఎత్తున నినాదాలు చేసిన వారి విషయంలో ఏ మత పెద్ద.. మజ్లిస్‌ నేతలు ఎందుకు ఫిర్యాదు చేయటం లేదు. అక్కడెక్కడో పాకిస్థాన్‌ కోర్టు లఖ్వీని విడుదల చేస్తే ఆగమాగమైపోయే వారంతా.. దేశంలోని హైదరాబాద్‌ లాంటి మహానగరంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు గొంతు విప్పరు. ప్రజాస్వామ్యవాదులమని చెప్పుకునే వారంతా.. సరికొత్త సంప్రదాయాల్ని.. సంస్కృతిని చూసీ చూడనట్లు ఎందుకు ఉంటున్నారు? దీనికి ఎవరు జవాబు చెబుతారు?

Tags:    

Similar News